భారత్ సమాచార్,అమరావతి ;
ఆంధ్రప్రదేశ్ లో మెగా డీఎస్సీ నిర్వహణకు సర్కారు సమాయత్తం అవుతోంది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే మెగా డీఎస్సీ నిర్వహణపై తొలి సంతకం చేసిన విషయం తెలిసిందే. మెగా డీఎస్సీ 2024 ద్వారా భర్తీ చేయనున్న 16 వేల 347 ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి మంత్రి మండలి తాజాగా ఆమోదం తెలిపింది. 16,347 డీఎస్సీ పోస్టులకు జులై 1న షెడ్యూల్ విడుదల కానుంది.ఇందులో భాగంగా ఎస్జీటీలు – 6,371, పీఈటీలు- 132, స్కూల్ అసిస్టెంట్ లు- 7,725, టీజీటీలు – 1781, పీజీటీలు – 286, ప్రిన్సిపాల్ లు – 52 పోస్టులను భర్తీ చేయనున్నారు. గత ప్రభుత్వం 6,100 టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పుడు ఆ నోటిఫికేషన్ ను రద్దు చేశారు. దాని స్థానంలో పెంచిన పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ను ఇస్తున్నారు.
డీఎస్సీ నిర్వహణ ఇకపై నిరంతర ప్రక్రియగా ఉంటుందని మంత్రి మండలి నిర్ణయించింది. అంటే ప్రతి సంవత్సరం డీఎస్సీ నిర్వహించబడుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేబినెట్ ద్వారా తెలిపారు. గత ప్రభుత్వం టెట్ పరీక్షను ప్రతి ఆరు నెలలకు ఒకసారి నిర్వహించకపోవడం వల్ల లక్షలాది మంది విద్యార్థులు నష్టపోయారన్నారు. ఈ నేపథ్యంలో ఇకపై టెట్ (టీచర్ ఎలిజబులిటీ టెస్ట్) పరీక్షను కూడా నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. నాణ్యత గల విద్యను అందించడమే లక్ష్యంగా టీచర్లకు నియామకం కంటే ముందే శిక్షణ ఇవ్వాలని మంత్రి మండలి నిర్ణయించింది. ఈ శిక్షణ డిసెంబర్ 10వ తేదీ నుంచి ప్రారంభం కావాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు సంబంధిత శాఖాధికారులకు సూచించారు. ప్రాథమిక స్థాయి నుంచే నాణ్యమైన విద్యాబోధనకు అవసరమైన విధివిధానాలను నిర్ణయించేందుకు ప్రస్తుత విద్యావిధానంతో పాటు జాతీయ విద్యా విధానాన్ని కూడా అధ్యయనం చేయాల్సిన అవసరముందని రాష్ట్ర కేబినెట్ భావించింది. ఆ దిశగా అధికారులు సమాయత్తం అవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు.
ఉమ్మడి జిల్లాలలో ఉన్న ఖాళీల వివరాలు
శ్రీకాకుళంలో 543,
విజయనగరంలో 583,
విశాఖలో 1134,
తూ.గో.లో 1346,
ప.గో.లో 1067,
కృష్ణాలో 1213,
గుంటూరులో 1159,
ప్రకాశంలో 672,
నెల్లూరులో 673,
చిత్తూరులో 1478,
కడపలో 709,
అనంతపురంలో 811,
కర్నూలులో 2678