భారత్ సమాచార్.నెట్, న్యూ ఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు నుంచి ఇప్పటి వరకు సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. బిహార్ ఓటర్ జాబిత సవరణ సహా ఆపరేషన్ సింధూర్ తదితర అంశాలపై పట్టుబడుతూ.. సభ కార్యకలాపాలకు విపక్షాలు అడ్డుగా మారాయి. జూలై 25న బీఏసీ సమావేశంలో పార్లమెంట్ సమావేశాలు సవ్యంగా సాగేలా చూడాలని అధికార విపక్షాలను స్పీకర్ ఓం బిర్లా కోరారు.
తాజాగా రేపు జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాలు సభ కార్యకలాపాలకు అడ్డు పడుతుందా లేదా అనేది చూడాలి. ఇక రేపు జరగబోయే సమావేశాల్లో ఉభయసభల్లో ఆపరేషన్ సింధూర్‌పై చర్చ జరగనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆపరేషన్ సింధూర్‌పై లోక్‌సభలో 16 గంటలు, రాజ్యసభలో 9 గంటల పాటు చర్చ జరగనుంది. ప్రధాని మోదీ సమక్షంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో ఈ చర్చను ప్రారంభించనున్నారు.
అటూ రాజ్యసభలో కూడా దీనిపై చర్చ జరగనుండగా.. జూలై 29న 9 గంటలపాటు ఈ అంశంపై చర్చించనున్నారు. రాజ్యసభలో కూడా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాజ్యసభలో సమాధానం ఇస్తారు. ఇకపోతే మొదటి నుంచే ఈ అంశంపై ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. రేపు జరగనున్న సమావేశాలు వాడీవేడిగా జరిగే ఛాన్స్ ఉంది. దీనిపై అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలనున్నాయి.