భారత్ సమాచార్, హైదరాబాద్ ;
గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్న విషయం అందరికి తెలిసిందే. దీంతో వాతవరణంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ మార్పుల కారణంగా.. నగరంలో వైరల్ ఫీవర్ తో పాటుగ దోమల బెడద కూడా ఎక్కువగా అయింది. ఈ దోమల బెడద వలనే రాష్ట్రంలో డెంగీ జ్వరాలు భారీగా విజృంభిస్తున్నాయి. ఎక్కడ చూసినా, డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. పట్నం, పల్లె అనే తేడా లేకుండా.. ఈ జ్వరాల బారిన పడి రోగులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. దీంతో కొన్ని ప్రభుత్వ హాస్పిటల్ లో అయితే ఏకంగా ఓపీకే సగటున 10 నుంచి 30 శాతం కేసులు పెరిగినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ప్రైవేట్ హాస్పిటల్స్ లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇకపోతే గత ఇరవై రోజులుగా ఈ జ్వరాల బారిన పడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగిపోతుందని తాజాగా అధికారులు తెలిపారు.
ఇక ఈ భారీ వర్షాల కారణంగా కొన్నిరోజులుగా రాష్ట్రంలో పారిశుద్ధ్యం లోపించడంతో దోమల విపరీతంగా పెరిగిపోయాయి. ప్రధానంగా హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్, సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం వంటి జిల్లాల్లో కూడా ఈ డెంగీ కేసులు ఎక్కువగా రికార్డ్ అవుతున్నట్లు తెలంగాణ వైద్యారోగ్యశాఖ అధికారులు తాజాగా వెల్లడించారు. కాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 4,395 డెంగీ కేసులు నమోదవ్వగా.. అందులో మూడో వంతు హైదరాబాద్ నగరంలోనే ఎక్కువగా నమోదైనట్లు తెలిసింది. ఇక ఇప్పటి వరకు అనధికారికంగా ఈ కేసులు అంతకు 10 రెట్లు అధికంగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.