భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ (Hyderabad) దిల్‌సుఖ్‌నగర్ (Dilsukhnagar) బాంబు పేలుళ్ల (Bomb Blast) కేసులో తెలంగాణ హైకోర్టు (Telangana Highcourt) ఊహించని తీర్పు వెలువరించింది. పేలుళ్లకు పాల్పడిన ఐదుగురికి ఉరిశిక్ష (Death Sentence) ఖరారు చేసింది. ఎన్ఐఏ (NIA) కోర్టు విధించిన ఉరిశిక్షను రద్దు చేయాలంటూ ఐదుగురు దోషులు (Five Convicts) దాఖలు చేసిన అప్పీల్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. ఇది ఉగ్రవాదంపై న్యాయపోరాటంలో ఒక ముఖ్యమైన ముందడుగు అని జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ పి.శ్రీసుధలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లోని బస్టాపులో, మిర్చిపాయింట్ వద్ద జరిగిన జంట పేలుళ్లలో 18 మంది మృతి చెందగా.. 130 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసును విచారించిన ఎన్‌ఐఏ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు 2016లో మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాది యాసిన్ భత్కల్ సహా ఐదుగురికి మరణశిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. అక్తర్, జియా ఉర్ రహమాన్, తహసీన్ అక్తర్, యాసిన్ భత్కల్, అజాజ్ షేక్‌కు ఉరిశిక్ష విధించింది. అయితే, ఈ తీర్పును సవాలు చేస్తూ నిందితులు తెలంగాణ హైకోర్టులో అప్పీల్ చేశారు. వీటిపై కె.లక్ష్మణ్, జస్టిస్ పి.శ్రీసుధలతో కూడిన ధర్మాసనం దాదాపుగా 45 రోజులపాటు సుదీర్ఘ విచారణ జరిపిన అనంతరం నేడు ఈ తీర్పును వెలువరించింది.
ఇక ఈ కేసులో 157 మంది సాక్ష్యాలను ఎన్ఐఏ రికార్డు చేసింది. ఈ ఘటనలో ఇండియన్ ముజాహిద్ ఉగ్రసంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ ప్రధాన నిందితుడిగా తేలింది. ఈ ఘటనలో అసదుల్లా అక్తర్, వకాస్, తెహసీన్ అక్తర్, ఎజాజ్ షేక్, సయ్యద్ మక్బూల్‌ని నిందితులుగా గుర్తించారు. మూడేళ్లు ఈ కేసులు విచారించిన ఎన్‌ఐఏ స్పెషల్ కోర్టు విచారణ తర్వాత నిందితులకు మరణశిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన యాసిన్ భత్కల్‌ను 2013లో నేపాల్ సరిహద్దుల్లో పట్టుకున్నారు. ఢిల్లీ, దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల కేసు సహా పలు కేసుల్లో దోషిగా తేలగా తిహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.