భారత్ సమాచార్, రాజకీయం : ఎన్నికల్లో గెలుపంటే అంతా ఈజీ కాదు.. ఎమ్మెల్యే కుర్చీలో కూర్చొవాలంటే ఆడిపాడినంతా అలకన కాదు.. ఎమ్మెల్యే బరిలో నిల్చొవాలంటే ధనబలం, మంద బలంతో పాటు ఎన్నికల మేనేజ్ మెంట్ స్కిల్స్ కూడా ఉండాలి. ఒక్కొక్కసారి అంతా బాగానే ఉన్నా
విజయానికి ఇండిపెండెంట్ అభ్యర్థులు అడ్డుగా నిలువొచ్చు. వారికొచ్చే ఓట్లతో గెలుపు గుర్రాన్ని షెడ్ కు పంపే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. గతంలో ఇలా జరిగిన సందర్బాలు చాలానే ఉన్నాయి. ఇండిపెండెంట్ల గుర్తులు ప్రధాన పార్టీల గుర్తులతో పోలి ఉండడం.. కొన్ని సార్లు వాళ్లకు కూడా వేలల్లో ఓట్లు పడడం.. ఇవన్నీ గెలిచే చాన్స్ ఉన్నా అభ్యర్థులకు పెద్ద సంకటంలా మారుతోంది.
ప్రధాన పార్టీ అభ్యర్థులను ఇబ్బందులు పెట్టడానికి కొన్ని సార్లు చాలా నియోజకవర్గాల్లో స్వతంత్రులు ఎక్కువగా పోటీ చేస్తుంటారు. ప్రధాన పార్టీల గుర్తులను పోలిన సింబల్స్ తో వాళ్లను గెలుపునకు దూరం చేయాలని చాలా తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. గతంలో దుబ్బాక ఎన్నికల్లో ఇలాంటి ఉదంతమే జరిగింది. కారు గుర్తును పోలిన సింబల్ కు ఐదు వేల ఓట్ల దాక పడి ..ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఓటమికి కారణమయ్యాయి. ఇలా చెప్పుకుంటూ పోతే గతంలో జరిగిన ఎన్నికల్లో ఇలాంటి ఎన్నో ఉదాహరణలు మన కళ్ల ముందు ఉన్నాయి. అందుకే స్వతంత్రులను పోటీ నుంచి తప్పించడానికి ప్రధాన పార్టీల అభ్యర్థులు వారికి ఎంతో కొంత డబ్బు ముట్టజెప్పి వారి నామినేషన్ ను విత్ డ్రా చేయించటానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు.
తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలోనూ సగటున 9 మంది స్వతంత్రులు ఎన్నికల బరిలో ఉన్నారు. కేసీఆర్ పోటీ పడుతున్న కామారెడ్డిలో అత్యధికంగా 26 మంది స్వతంత్రులు పోటీ పడుతున్నారు. అలాగే మరో నియోజకవర్గం గజ్వేల్ లోనూ 24 మంది, జహీరాబాద్ లో 24 మంది.. ఇలా ప్రతి నియోజకవర్గంలో ఇండిపెండెంట్లు భారీగానే ఎన్నికల బరిలోకి దిగారు. దీంతో ఏ స్వతంత్ర అభ్యర్థితో తమకు ఎఫెక్ట్ పడుతుందోనని ప్రధాన పార్టీల అభ్యర్థులు గుబులుగా ఉన్నారు.