భారత్ సమాచార్.నెట్: భారత ప్రధాని నరేంద్ర మోదీ (India Prime Minister Narendra Modi)పై అమెరికా అధ్యక్షుడు (America President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన చాలా తెలివైన వ్యక్తి (Very smart man) అని.. తనకు మంచి మిత్రుడని పేర్కొన్నారు. ఇటీవల ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వాణిజ్య సుంకాలపై చర్చలు జరిగాయి. అయితే ఈ అంశంపై ట్రంప్‌ను విలేకర్లు ప్రశ్నించగా.. ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా-భారత్ మధ్య వాణిజ్య చర్చలు చాలా బాగా జరుగుతున్నాయని తెలిపారు.
‘‘భారత్ ప్రజలకు గొప్ప ప్రధాని ఉన్నారు. ఆ దేశంతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రధాని మోదీ ఇటీవలే అమెరికాకు వచ్చారు. మేము ఎల్లప్పుడూ చాలా మంచి స్నేహితులం. కానీ ఆ దేశంతో మాకున్న ఏకైక సమస్య సుంకాలు. ప్రపంచంలోనే అత్యధిక టారిఫ్‌లు విధించే దేశాల్లో ఇండియా ఒకటి. బహుశా వాటిని వారు తగ్గించబోతున్నారని నమ్ముతున్నా.. అయితే ఏప్రిల్ 2న వారు మన దిగుమతులపై ఎంత సుంకాలు వసూలు చేస్తే .. నేను వారి నుంచి అంతే వసూలు చేస్తా’ అని ట్రంప్ పేర్కొన్నారు.
ఇకపోతే భారత్ వాణిజ్య విధానాలను ట్రంప్ పదే పదే విమర్శిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. సుంకాల విషయంలో భారత్‌పై గతంలోనూ ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. కాగా, ప్రధాని మోదీ ఫిబ్రవరిలో అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భారత్ అమెరికాలు ద్వైపాక్షిక వాణిజ్య సబంధాలను మరింతంగా పెంచుకోవాలని నిర్ణయించుకున్నాయి. మోదీ ట్రంప్‌లు తమ నూతన ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యాన్ని ‘మిషన్ 500’గా నిర్ణయించారు. 2030 నాటికి ఇరు దేశాల వస్తు, సేవల వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా నిర్థారించారు.