భారత్ సమాచార్, తిరుమల ;
కలియుగ ప్రత్యక్ష దైవం ఏడు కొండల శ్రీనివాసుడి చెంత బ్రహోత్సవాల కారణంగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. సాధారణంగా భక్తులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి దాతలు తమకు తోచినంత విరాళం అందిస్తుంటారు. ఈ క్రమంలో టీటీడీ ప్రాణదాన ట్రస్ట్‌కు ఓ వ్యక్తి రూ. 21 కోట్ల భారీ విరాళం అందించారు. పంజాబ్‌లోని ట్రైడెంట్ గ్రూప్‌కు చెందిన రాజిందర్ గుప్తా టీటీడీకి ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.21 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు దాత రాజిందర్ గుప్తా చెక్కును టిటిడి అదనపు కార్యనిర్వహణాధికారి సి వెంకయ్య చౌదరికి తిరుమలలోని వారి క్యాంపు కార్యాలయంలో అందజేశారు.
అన్నదానం ట్రస్టుకు రూ.1 కోటి విరాళం
బెంగళూరు, హైదరాబాద్‌కు చెందిన సుమధుర గ్రూప్ సీఎండీ మధుసూధన్ టీటీడీ అన్న ప్రసాదం ట్రస్టుకు భారీ విరాళం అందించారు. మధుసూధన్ రూ.1 కోటిని ట్రస్టుకు విరాళంగా ఇటీవల అందించారు. విరాళానికి సంబంధించిన డీడీని తిరుమలలోని గోకులం గెస్ట్ హూస్ లో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు.
ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.1.5 కోట్ల విరాళం
తిరుమల శ్రీనివాసుడికి ఓ భక్తుడు ఇటీవల భారీ విరాళం అందజేశారు. తెనాలికి చెందిన నేషనల్ స్టిల్స్ సీఎఫ్ఓ సత్య శ్రీనివాస్ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.1.5 కోట్లను విరాళంగా అందజేశారు. తిరుమల గోకులం గెస్ట్ హౌస్ లోని మీటింగ్ హాల్‌లో విరాళం చెక్కును దాత సత్య శ్రీనివాస్ టీటీడీ ఈవో శ్యామల రావుకు అందజేశారు.