భారత్ సమాచార్, అమరావతి ;
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం డ్వాక్రా మహిళల స్వాలంభన కోసం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ, ఎస్టీ, డ్వాక్రా మహిళలకు రుణ పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పెంచేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. కనిష్టంగా రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణాలను డ్వాక్రా మహిళలకు అందిస్తారు. డ్వాక్రా మహిళలకు ఈ రుణాన్ని వాయిదా రూపంలో తిరిగి చెల్లిస్తారు. 2024- 25 ఏడాదికి సంబంధించి రూ.250 కోట్లు రుణంగా ఇవ్వాలని అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు.
ఇప్పటికే ఈ ఉత్తర్వుల పై ఎమ్ ఎస్ఎమ్ ఈ , సెర్ప్, ఎన్ ఆర్ఐ వ్యవహారాలశాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సంతకం చేశారు. ఈ ఉన్నతి పథకం కింద రుణం మంజూరుకు ప్రణాళికలు అమలు చేస్తున్నారు. డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ మహిళలు ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకున్న నెలలో యూనిట్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో గ్రామ సంఘం స్థాయి నుంచి అన్ని దశ ల్లోనూ పర్యవేక్షణ ఉంటుంది. అలాగే లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న జీవనోపాధికి అనుగుణంగా రుణం మంజూరు చేయనున్నారు. ఏ జీవనోపాధి ఏర్పాటు చేసుకోవాలనేది డ్వాక్రా మహిళల ఆసక్తులపై ఆధారపడి ఉంటుంది..