భారత్ సమాచార్, తాడేపల్లిగూడెం ; ‘‘ సామాన్యుడి బతుకు దెబ్బ కంటే, జగన్ కు తగిలిన గులకరాయి దెబ్బ పెద్దదా..?’’ అంటూ జనసేన అధినేత పవణ్ కళ్యాణ్ తాడేపల్లిగూడెంలో నిర్వహించిన వారాహి విజయభేరీ ఎన్నికల ప్రచార భేరీ సభలో ప్రశ్నించారు.
ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత మాట్లాడుతూ… “దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ శ్రీశైలం శివుడికి మహా కుంభాబిషేకం విషయంలో రకరకాల మాటలు చెబుతున్నారన్నారు. ఆయన ప్రజలను మభ్య పెడుతున్నారని ఆరోపించారు. కడప ఒంటిమిట్ట రామచంద్రస్వామి దేవస్థానంలో కళ్యాణం రోజు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి ముఖం చాటేస్తే, దేవాదాయశాఖ మంత్రి ఆ బాధ్యతను తీసుకోవాలి. కాని అనూహ్యంగా ఇసుక దొంగ, మైనింగ్ దొంగ అయిన పెద్దిరెడ్డిని పట్టు వస్త్రాలు ఇచ్చేందుకు పంపారని విమర్శించారు.
జగన్ కు తగిలితేనే దెబ్బ..?
2019 లో ఒక్క ఛాన్స్ అంటూ ప్రజల్ని నిలువునా మోసం చేసిన దొంగ మళ్లీ వస్తున్నాడు. ఆయన గెలవాలి అంటే, ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఎవరో ఒకరు చచ్చిపోవాలి లేదా ఏదో ఒక దెబ్బ తగలాలి. ఏదో ఒకటి కూల్చివేస్తే తప్ప ఆయనకు నిద్రపట్టదు. విధ్వంసం, వినాశనం మాత్రమే ఒంట బట్టించుకున్న ఆ దొంగకు ప్రజలే తగిన బుద్ధి చెప్పాలి. లేకుంటే రాష్ట్రాన్ని కాపాడటం ఆసాధ్యమన్నారు. 2019 నుంచి 2024 వరకు ఓ దెయ్యాన్ని నమ్మి భుజాలపై ఎక్కించుకొని తిరగామన్నారు. ఇకనైనా కనువిప్పు కలిగి ఆ దెయ్యాన్ని రాష్ట్రం బయటకు పంపుదామన్నారు. ఆంధ్రప్రదేశ్ ను రక్షించుకునే బాధ్యతను నెరవేరుద్దామన్నారు. జగన్ కు చిన్న గులకరాయి దెబ్బ తగిలితేనే దెబ్బ తగిలినట్టా..? దానికి నొప్పి. మంట ఉంటుందా..? భవన నిర్మాణ కార్మికులు జగన్ తీసుకొచ్చిన ఇసుక విధానంతో కూలి పనులు కోల్పోయి 39 మంది ఆకలితో చనిపోతే దెబ్బ తగలదా..? 15 ఏళ్ల బాలుడ్ని చెరకు తోటలకు పెట్రోలు పోసి హత్య చేస్తే నొప్పి ఉండదా..? ఓ దళితుడ్ని హత్య చేసి, వాళ్లింటికే డెడ్ బాడీని డోర్ డెలివరీ చేస్తే ఆ పేద కడుపులు మండవా..? సామాన్యుడి బతుకులు పోయినా, వారి జీవితాలు రోడ్డున పడిపోయినా చీమకుట్టినట్లు ఉండదా..? జగన్ కు చిన్న గులకరాయి దెబ్బ తగిలితే మాత్రం మామూలు హడావుడి ఉండదు. ఇదే నాకు ఆవేదన కలిగిస్తోంది.
సలహాదారుల జీతాలకే రూ.640 కోట్ల ప్రజా ధనం వృథా
దేశాన్ని పాలించే ప్రధాని మోదీ నెల జీతం రూ.1.60 లక్షలు. జగన్ ప్రభుత్వంలో ఆయన నియమించుకున్న 89 సలహాదారులకు ప్రజాధనం నుంచి వెచ్చించిన సొమ్ము అక్షరాల రూ.640 కోట్లు. కానీ రాష్ట్ర కోసం వీరిచ్చిన సలహాలు ఏమిటనేది ఎవరికీ తెలీదు. ఎప్పటికి తెలీదు.వాలంటీర్లకు సాక్షి పేపర్ వేసినందుకు రూ.600 కోట్లు ఇచ్చారు. ఇలా ప్రజా ధనాన్ని విచ్చలవిడిగా పందేరం చేశారు. అదే డబ్బును విద్యార్థుల ఫీజు రియంబర్సుమెంటుకో, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికో, ఉద్యోగుల పెండింగ్ బకాయిలు ఇచ్చేందుకో వెచ్చించి ఉంటే చాలా సమస్యలు తీరేవి. జగన్ కు జనం సమస్యలు పట్టవు కాబట్టి ఆ పని చేయడు.
జగన్ పై చీటింగ్ కేసు పెట్టాలా..?
ఉద్యోగులు ప్రభుత్వం వద్ద దాచుకున్న పీఎఫ్ సొమ్మును జగన్ వాళ్లకే తెలియకుండా దారి మళ్లించాడు. పీఎఫ్ డబ్బులు ఏవని అడిగితే స్పందించడు. మనం ఒకరి వద్ద డబ్బు దాచుకుంటే, అతడు మోసం చేస్తే చీటింగ్ కేసు ఎడతాం. మరి జగన్ ప్రభుత్వ ఉద్యోగులు దాచుకున్న డబ్బును వారికే తెలియకుండా మళ్లిస్తే ఎవరిపై కేసు పెట్టాలి. ఎవరిని నిందితులుగా చూడాలి. జగన్ చేసిన మోసాన్ని ఎన్నికల సమరంలో ప్రజాకోర్టులోనే తెలుద్దామన్నారు.
జనసేన పార్టీ నుంచి గెలిచే ప్రతి ఒక్క ఎమ్మల్యే కూడా బాధ్యతాయుతంగా ఉంటారని పార్టీ అధ్యక్షుడిగా హామి ఇస్తున్నట్టు తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే పాలన సాగిస్తుందని హామి ఇస్తున్నట్టు చెప్పారు. ఎవరింట్లో కష్టం వచ్చినా అండగా నిలబడే బొలిశెట్టి శ్రీనివాస్ అంటే తనకి ప్రత్యేకమైన అభిమానం ఉందన్నారు. కష్టకాలంలో ఆయన నా వెన్నంటి నిలిచారన్నారు. అలాంటి వ్యక్తికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు అండగా నిలబడాలని కోరారు. బొలిశెట్టి శ్రీనివాస్ కి గాజు గ్లాసు గుర్తుపై, ఎంపీ అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాస వర్మ కి కమలం గుర్తుపై ఓటు వేయండని ఓటర్లను అభ్యర్థించారు.