భారత్ సమాచార్ ; ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో సమ్మర్ హీట్ తో పాటుగా పొలిటికల్ హీట్ కూడా భారీగా పెరిగింది. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఓటర్లను ప్రసన్నం చేసుకోటానికి ఎన్నికల ప్రచారంలో మునిగితేలుతున్నారు. గెలుపు వ్యూహాల కోసం పొలిటికల్ కన్సల్టెన్సీ సర్వేలను ఆశ్రయిస్తున్నారు. అపరిమిత ఉచిత హామీలను ప్రకటిస్తున్నారు. ఎలక్షన్ కోడ్ నిబంధనలను దాటి మరి తమ ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో శృతి మించి విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందుకు సీనియర్ నాయకులు సైతం మినహాయింపు కాదు. తాజాగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఎమ్మిగనూరు, బాపట్ల, మార్కాపురం నియోజకవర్గాల్లో మార్చి 31 న భారీ స్థాయిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ప్రతిపక్ష నాయకుడు నిర్వహించిన ఈ ప్రచార సభల్లో ప్రస్తుత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని రాక్షసుడు, దొంగ అంటూ అసభ్య పదజాలంతో విమర్శించాడని వైసీపీ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసింది. దీనిపై వైసీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఈసీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదును అందించారు. దీంతో ఈసీ చర్యలు చేపట్టింది. దీనిపై 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని కోరుతూ చంద్రబాబుకు ఎలక్షన్ కమిషన్
గురువారం నోటీసులు జారీ చేసింది. దీనిపై ప్రతిపక్ష నాయకుడు ఎలాంటి వివరణ ఇస్తారు, ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు చేపడుతుంది అనేది తెలియాలి అంటే మరో రెండు రోజులు ఎదురుచూడాలి.