భారత్ సమాచార్.నెట్, కర్నూలు జిల్లా: ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సామాజిక కార్యకర్త కమలాకర్ నాయుడు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఆదిమానవుడి వేషధారణలో ఆయన ఆలూరు బస్టాండ్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న 21వ రోజు రిలే నిరాహార దీక్షల్లో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించారు. ఆలూరు ప్రాంతం సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే ఆదోని జిల్లా ఏర్పాటు అనివార్యమని ఈ సందర్భంగా జేఏసీ నాయకులు స్పష్టం చేశారు.
స్థానిక ఎమ్మెల్యేలు ప్రజల ఆకాంక్షను అసెంబ్లీలో వినిపించాలని, లేనిపక్షంలో తమ పదవులకు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ దీక్షలకు కత్తి రామాంజనేయులు, భూపేష్, దాదా భాష తదితర జేఏసీ నాయకులు మద్దతుగా కూర్చున్నారు. సిపిఐ, వివిధ ప్రజా సంఘాల నాయకులు ఈ నిరసనకు సంఘీభావం ప్రకటించారు. ఆదోని జిల్లా సాధించే వరకు పోరాటం ఆపేది లేదని వారు తేల్చి చెప్పారు.