భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రెండవ రోజు నామినేషన్ ప్రక్రియ సందర్భంగా తూప్రాన్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ కేంద్రం వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. నామినేషన్ కేంద్రాల పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. నామినేషన్ కేంద్రానికి అభ్యర్థితో పాటు ఒకరు లేదా ఇద్దరు ప్రతిపాదకులు మాత్రమే అనుమతించబడతారని స్పష్టం చేశారు. అభ్యర్థులు మరియు వారి అనుచరులు ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలని సూచించారు.ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా వాహనాలను దూరంగా పార్క్ చేయాలని, గుంపులుగా రావడం, నినాదాలు చేయడం, ర్యాలీలు నిర్వహించడం పూర్తిగా నిషేధమని తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడతామని పేర్కొన్నారు. సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణ, బారికేడ్లు, ట్రాఫిక్ నియంత్రణ వంటి భద్రతా చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. జిల్లాలో శాంతియుత, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు పోలీస్ శాఖ పూర్తిగా కట్టుబడి ఉందని ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి, ఆర్డీఓ జయ చంద్ర రెడ్డి, తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, ఎస్ఐలు సుభాష్ గౌడ్, గంగా రాజు తదితర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
29, జనవరి 2026, గురువారంభారత్ సమాచార్