భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: వెల్దుర్తి మండల కేంద్రంలో ప్రముఖ వ్యాపారి, అజాతశత్రువుగా పేరుగాంచిన ‘మెడికల్’ సిద్ధరాములు (60) మరణంతో పట్టణం శోకసంద్రంలో మునిగిపోయింది. గత 45 ఏళ్లుగా తన సోదరుడు డాక్టర్ నరసింహులుకు అండగా ఉంటూ, వైద్య సేవల్లో తనదైన ముద్ర వేశారు. కేవలం వ్యాపారిగానే కాకుండా, మందుల కోసం వచ్చే పేద ప్రజల కష్టసుఖాలను విచారిస్తూ, డబ్బులు లేని వారికి ఉచితంగా మందులు అందజేస్తూ అపారమైన ఔదార్యాన్ని చాటుకున్నారు.
కుక్కునూరు గ్రామానికి చెందిన సిద్ధరాములు, వెల్దుర్తిలో దశాబ్దాలుగా నిస్వార్థ సేవలు అందించి అందరి మన్ననలు పొందారు. ఆయన భౌతికకాయం వెల్దుర్తికి చేరుకోవడంతో స్థానికులు, పేద ప్రజలు కన్నీరుమున్నీరయ్యారు. సిద్ధరాములు గారి సేవా దృక్పథం నేటి వైద్య రంగంలోని వారికి ఆదర్శమని పలువురు కొనియాడారు.