భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా : కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం పి.ఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ప్రచార వాహనాన్ని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం ద్వారా ప్రజలు తమ గృహాలపై సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దీనివల్ల విద్యుత్ చార్జీల భారం గణనీయంగా తగ్గుతుందని, పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఈ ప్రచార వాహనం జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల్లో పర్యటించి, పథకంపై ప్రజలకు అవగాహన కల్పిస్తుందని తెలిపారు. సౌర విద్యుత్ వినియోగం ద్వారా లభించే రాయితీలు, ప్రయోజనాల గురించి ప్రజలు తెలుసుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.