భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

20, జూన్ 2026, శనివారంభారత్ సమాచార్

మహబూబాబాద్‌లో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం..

WhatsApp Image 2026-06-19 at 4.18.08 PM

భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ జిల్లా: జిల్లా కేంద్రమైన మహబూబాబాద్‌లో ఆదివారం నాడు నిర్వహించనున్న ‘తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనానికి’ నాడు ప్రత్యేక రాష్ట్ర కాంక్షతో ఉద్యమించిన వీరులందరూ పెద్ద సంఖ్యలో తరలిరావాలని జేఏసీ జిల్లా చైర్మన్ డోలి సత్యనారాయణ పిలుపునిచ్చారు. నెల్లికుదురు మండల కేంద్రంలోని విద్యాసంస్థల సముదాయ ఆవరణలో శుక్రవారం జేఏసీ మండల అధ్యక్షులు హలావతు లింగన్న అధ్యక్షతన ఉద్యమకారుల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పిల్లి సుధాకర్, మైస శ్రీనివాస్‌లతో కలిసి జిల్లా చైర్మన్ డోలి సత్యనారాయణ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఉద్యమకారులను గుర్తించడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు కాలయాపన చేసినప్పటికీ.. ఆలస్యంగానైనా ఉద్యమకారులను చట్టబద్ధంగా గుర్తించేందుకు ప్రత్యేక కమిటీని వేయడం సంతోషదాయకమన్నారు. ఈ గుర్తింపు ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మహబూబాబాద్ జిల్లాలో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ చారిత్రాత్మక సమ్మేళనానికి జేఏసీ రాష్ట్ర చైర్మన్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, మరియు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్లు వెల్లడించారు.

ఉద్యమకారులను చట్టబద్ధంగా గుర్తించనున్న దృష్ట్యా.. నాడు ఉద్యమ సమయంలో పాల్గొన్న వీడియోలు, దినపత్రికల క్లిప్పింగులు, ఫోటోలు, బైండోవర్లు, పోలీసు కేసుల నమోదు పత్రాలు వంటి ఎలాంటి వివరాలు ఉన్నా సరే వాటిని సమ్మేళనానికి వెంట తీసుకురావాలని ఈ సందర్భంగా ఉద్యమకారులకు సూచించారు.

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియలో రాజకీయ పార్టీలకతీతంగా, పూర్తి పారదర్శకత పాటించాలని డోలి సత్యనారాయణ స్పష్టం చేశారు. ఒకవేళ అర్హుల గుర్తింపులో రాజకీయాలు జొరబడి పారదర్శకత లోపిస్తే.. అర్హులైన నిజమైన ఉద్యమకారుల కోసం మరో ఉద్యమం చేయడానికి కూడా వెనకాడబోమని హెచ్చరించారు. స్వరాష్ట్ర సాధన కోసం సాగిన మలిదశ ఉద్యమంలో ప్రజల వైపు రాజకీయ పార్టీలు వచ్చాయే తప్ప, పార్టీల వైపు ప్రజలు వెళ్లలేదనే విషయాన్ని పాలకులు గుర్తుంచుకోవాలన్నారు. నాడు రాజకీయాలను పక్కనపెట్టి కేవలం లక్ష్యం కోసం ప్రజలంతా కదం తొక్కారని కొనియాడారు.

కార్యక్రమంలో ఉద్యమకారులు గుండా వెంకన్న, ఆకుల జగ్గయ్య, పెరుమాండ్ల గుట్టయ్య గౌడ్, యాసం రమేష్, జిలకర యాలాద్రి, వీరగాని మల్లేష్ గౌడ్, దాసరి ప్రకాష్, ఇరుగు నాగన్న, ఇరుగు అనిల్, కురియావల కృష్ణయ్య గౌడ్, కూరపాటి వెంకటేశ్వర్లు మద్ది వెంకన్న, బండారి సారంగం తదితరులు పాల్గొన్నారు.