భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా (ఇనుగుర్తి): మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలంలోని మీట్యా తండా గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి సోమవారం భూమి పూజ నిర్వహించారు. మీట్యా తండా గ్రామపంచాయతీ పరిధిలోని పంతులు తండాలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ భూక్య చిన్ని వెంకన్న, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు. అయితే గ్రామపంచాయతీ భవనం నిర్మించే స్థలంపై కొందరు తండావాసులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ సందర్భంగా సర్పంచ్ భూక్య చిన్ని వెంకన్న మాట్లాడుతూ, ఉపాధి హామీ (EGS) నిధులతో రూ.20 లక్షల వ్యయంతో ఆధునిక సౌకర్యాలతో గ్రామపంచాయతీ భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. గత ఎనిమిదేళ్లుగా గ్రామపంచాయతీకి సొంత భవనం లేకపోవడంతో పాలకవర్గంతో పాటు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్ కృషితో ఈ భవనం మంజూరైందని పేర్కొంటూ ఆయనకు గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
అయితే భూమి పూజ అనంతరం మీట్యా తండా, మర్రికుంట తండాలకు చెందిన కొందరు గ్రామస్థులు భవన నిర్మాణ స్థలంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ పరిధిలోని అన్ని తండాల ప్రజలకు సమానంగా అందుబాటులో ఉండే ప్రాంతంలో భవనం నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఇరువర్గాల మధ్య కొద్దిసేపు వాగ్వివాదం చోటుచేసుకున్నప్పటికీ పరిస్థితి అదుపులోకి వచ్చింది.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, మాజీ సర్పంచ్ బానోతు నరేష్, బానోతు బాలు నాయక్, బానోతు రమేష్, బానోతు వెంకన్న, బిక్షపతి తదితరులు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. గ్రామ ప్రజలందరికీ అనుకూలంగా ఉండే ప్రాంతంలోనే భవనం నిర్మించాలని వారు కోరారు.
ఈ వివాదంపై స్పందించిన సర్పంచ్ చిన్ని వెంకన్న నాయక్ మాట్లాడుతూ, అటవీ భూమిలో గ్రామపంచాయతీ భవనం నిర్మించవద్దని సంబంధిత అధికారులు సూచించడంతోనే పంతులు తండాలో నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. గ్రామపంచాయతీ పాలక మండలి తీర్మానం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. గ్రామాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.