భారత్ సమాచార్, హైదరాబాద్: పోలీస్ స్టేషన్ నిర్మాణానికి కేటాయించిన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమణల నుంచి హైడ్రా రక్షించింది. రంగారెడ్డి జిల్లా ఉప్పల్ మండలం కొత్తపేట్ గ్రామంలోని సర్వే నంబర్లు 135, 136లో ఉన్న 6 గుంటల భూమిని కబ్జాల నుంచి విముక్తి చేసి ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది.
చైతన్యపురి పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం ఈ భూమిని కేటాయించింది. ఇందులో సర్వే నంబర్ 135లో 4 గుంటలు, సర్వే నంబర్ 136లో 2 గుంటలు కలిపి మొత్తం 6 గుంటల స్థలం ఉంది. అయితే సర్వే నంబర్ 135లోని 4 గుంటల ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించి షెడ్లు నిర్మించారు.
ఈ విషయాన్ని గుర్తించిన పోలీస్ శాఖ ఆక్రమణలను తొలగించి స్థలాన్ని రక్షించాలని హైడ్రాను కోరింది. దీంతో హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి, ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు జరిగినట్లు నిర్ధారించారు. అనంతరం బుధవారం హైడ్రా సిబ్బంది రంగంలోకి దిగి అక్రమంగా నిర్మించిన షెడ్లను తొలగించారు.
భవిష్యత్తులో మళ్లీ ఆక్రమణలు జరగకుండా సర్వే నంబర్లు 135, 136లోని మొత్తం 6 గుంటల స్థలానికి హైడ్రా ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. అలాగే ఈ భూమి పోలీస్ స్టేషన్ నిర్మాణం కోసం కేటాయించిన ప్రభుత్వ స్థలం అని సూచిస్తూ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ భూముల పరిరక్షణలో భాగంగా హైడ్రా చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.