భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

29, జులై 2026, బుధవారంభారత్ సమాచార్

టెహ్రాన్ వీడియో కలకలం.. అమెరికాలో హైఅలర్ట్

7fc21485-AP20055449202167

భారత్ సమాచార్, హైదరాబాద్: అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, టెహ్రాన్ నుంచి వెలుగులోకి వచ్చినట్లు ప్రచారం జరుగుతున్న ఒక వీడియో అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఆ వీడియోలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, ఆమె కుమారుడు బారన్ ట్రంప్‌పై బెదిరింపు తరహా అంశాలు ఉన్నాయని విదేశీ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ వీడియో ప్రామాణికతపై ఇప్పటివరకు అధికారికంగా ధృవీకరణ వెలువడలేదు.

“వేర్ టు కిల్ మెలానియా” అనే శీర్షికతో ప్రచారం జరుగుతున్నట్లు చెప్పబడుతున్న ఈ వీడియోలో మెలానియా ట్రంప్ న్యూయార్క్‌లో ప్రయాణించే మార్గాలు, ఆమె సందర్శించే ప్రాంతాలను ప్రస్తావించినట్లు సమాచారం. ఆమె వ్యక్తిగత అలవాట్లు, భద్రతకు సంబంధించిన వివరాలను ప్రస్తావిస్తూ దాడులకు అనుకూలంగా చిత్రీకరించినట్లు వార్తలు వెలువడ్డాయి. అంతేకాకుండా, ఆమె ఉపయోగించే వస్తువులను కలుషితం చేయడం వంటి తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు, చివర్లో బారన్ ట్రంప్‌ను ఉద్దేశించి కూడా బెదిరింపు సందేశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ వీడియోపై ఇప్పటివరకు వైట్ హౌస్ ఈస్ట్ వింగ్ లేదా అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అయితే మెలానియా ట్రంప్, బారన్ ట్రంప్ ఇద్దరూ సీక్రెట్ సర్వీస్ భద్రతలోనే ఉన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ట్రంప్ కుటుంబానికి సంబంధించిన ప్రధాన ప్రదేశాలైన వైట్ హౌస్, ట్రంప్ టవర్, బెడ్‌మినిస్టర్ గోల్ఫ్ క్లబ్, మార్-ఎ-లాగో ఎస్టేట్‌ల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు సమాచారం.

ఇరాన్ నుంచి అమెరికా వ్యతిరేక ప్రచారం పెరుగుతున్న సమయంలో ఈ వీడియో వెలుగులోకి రావడం మరింత ఆసక్తికరంగా మారింది. ఇటీవల ట్రంప్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్న పోస్టర్లు, నినాదాలు కూడా బయటకు వచ్చినట్లు కథనాలు వచ్చాయి. అయితే ఈ వీడియోను ఎవరు రూపొందించారు, దాని వెనుక అసలు ఉద్దేశం ఏమిటి, ఇందులోని సమాచారం ఎంతవరకు నిజమనే అంశాలపై ఇప్పటికీ స్పష్టత లేదు. భద్రతా సంస్థలు ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తుండగా, అంతర్జాతీయంగా ఈ పరిణామం చర్చకు దారితీసింది.

ట్రంప్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత పౌర పురస్కారం