భారత్ సమాచార్, మెదక్ జిల్లా: గురుపౌర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకుని మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని శ్రీ సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోగా, సాయిబాబా ఆశీస్సులు పొందేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
ఈ కార్యక్రమానికి నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మాచునూరి లక్ష్మీరాజు యాదవ్ ముఖ్యంగా హాజరై శ్రీ సాయిబాబా వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, భక్తులకు గురుపౌర్ణిమ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ, భారతీయ సంస్కృతిలో గురువులకు విశిష్ట స్థానం ఉందని, గురువుల మార్గదర్శకత్వం వ్యక్తిత్వ వికాసానికి, సమాజ అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. సాయిబాబా బోధించిన మానవతా విలువలు, సేవాభావాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేసి గురుపౌర్ణిమ వేడుకలను ఘనంగా నిర్వహించారు.