భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

31, జులై 2026, శుక్రవారంభారత్ సమాచార్

మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత

586179-peddi

భారత్ సమాచార్, వరంగల్ జిల్లా: బీఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి (51) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం అర్ధరాత్రి 12:51 గంటలకు తుదిశ్వాస విడిచారు. పల్మనరీ ఎంబోలిజం కారణంగా గుండె ఆగిపోవడం, ఆక్సిజన్ లోపంతో మెదడుకు తీవ్ర నష్టం జరగడంతో వైద్యులు ఐదు రోజుల పాటు చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆయన మృతితో బీఆర్ఎస్ శ్రేణులు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు స్వగ్రామమైన నల్లబెల్లిలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

1974 ఆగస్టు 6న వరంగల్ జిల్లా నల్లబెల్లిలో రైతు కుటుంబంలో జన్మించిన పెద్ది సుదర్శన్ రెడ్డి విద్యార్థి దశలోనే రాజకీయాల్లో అడుగుపెట్టారు. మహబూబియా పంజాథన్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ఆయన మొదట ఎన్‌ఎస్‌యూఐ, అనంతరం యువజన కాంగ్రెస్‌లో పనిచేశారు. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఆవిర్భావ సమయంలోనే పార్టీలో చేరి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. నల్లబెల్లి మండలం నుంచి జెడ్పీటీసీగా గెలిచి జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్‌గా, ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ ఉద్యమాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్లడంలో విశేష పాత్ర పోషించారు.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో నర్సంపేట నుంచి పోటీ చేసినప్పటికీ విజయం దక్కలేదు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఘన విజయం సాధించి నర్సంపేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలంగాణ పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్‌గా, శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) సభ్యుడిగా కూడా సేవలందించారు. రోడ్లు, తాగునీరు, వ్యవసాయ సమస్యల పరిష్కారం, కరోనా సమయంలో సహాయక చర్యలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా గుర్తింపు పొందారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

ఈ నెల 26న హనుమకొండలో ఉన్న సమయంలో తీవ్ర ఛాతినొప్పితో కుప్పకూలిన ఆయనకు కార్డియాక్ అరెస్ట్ వచ్చినట్లు వైద్యులు గుర్తించి అత్యవసర చికిత్స అందించారు. అనంతరం హైదరాబాద్‌కు తరలించి వెంటిలేటర్‌పై ఉంచినా ఆరోగ్య పరిస్థితి విషమించి కన్నుమూశారు. భార్య స్వప్న, కుమారుడు నిధర్షన్ రెడ్డి, కుమార్తె ధర్మిష్ఠ రెడ్డి ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో అంకితభావంతో పనిచేసిన నాయకుడిగా, ప్రజలకు చేరువైన ప్రజాప్రతినిధిగా ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు నివాళులర్పించారు.