భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

22, ఆగస్టు 2026, శనివారంభారత్ సమాచార్

సీఎం అమెరికా పర్యటన రద్దు వెనుక బీజేపీ కుట్ర: VH

874ba7e0-6fa9-48ea-a931-f14808586b41

భారత్ సమాచార్, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడం వెనుక బీజేపీ నేతల కుట్రలు ఉన్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు ఆరోపించారు. శుక్రవారం బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెబుతున్న ‘వికసిత్ భారత్’లో తెలంగాణ రాష్ట్రం ఉండకూడదనే కుట్రలు జరుగుతున్నట్లు తమకు అర్థమవుతోందని వి.హనుమంతరావు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తుంటే, కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధికి, పెట్టుబడుల ఆకర్షణకు ఆటంకాలు కలిగించే చర్యలను కేంద్రం మానుకోవాలని సూచించారు.

మెజారిటీగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు జనాభా దామాషా ప్రకారం న్యాయం జరగాలన్న రాహుల్ గాంధీ లక్ష్య సాధన కోసం కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తోందని వి.హనుమంతరావు తెలిపారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం పార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనలో ఓబీసీ జనాభా లెక్కలు చూపకుండా బీజేపీ అడ్డంకులు సృష్టిస్తోందని వి.హనుమంతరావు విమర్శించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC)లో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ నెల 25న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఓబీసీ మహాసభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సభ ద్వారా బీసీల హక్కులు, సామాజిక న్యాయంపై విస్తృతంగా చర్చించనున్నట్లు తెలిపారు.