భారత్ సమాచార్, సినిమా: ఒక హీరో సినిమా చూసి మనం అభిమానులం అవుతాం. కానీ ఒక హీరో జీవిత ప్రయాణాన్ని చూసి మన జీవితాన్నే మార్చుకోవాలనిపిస్తే.. అదే ఒక నిజమైన స్టార్‌కి, ఒక నిజమైన ఇన్‌స్పిరేషన్‌కి మధ్య ఉన్న తేడా. తెలుగు సినిమా చరిత్రలో అలాంటి ప్రయాణమే చిరంజీవిది. ఒక సాధారణ యువకుడి కలతో మొదలై వెండితెరపై సంచలనంగా మారి, కోట్లాది మంది అభిమానుల గుండెల్లో ఒక ఎమోషన్‌గా నిలిచి, చివరకు “మెగాస్టార్” అనే పేరునే ఒక బ్రాండ్‌గా మార్చిన ప్రయాణం. 1955 ఆగస్టు 22న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో కొణిదెల శివశంకర వరప్రసాద్ జన్మించారు. తర్వాత ప్రపంచానికి చిరంజీవిగా పరిచయమయ్యారు. చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి పెంచుకున్న ఆయన మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ తీసుకుని నటుడిగా తనను తాను తీర్చిదిద్దుకున్నారు. అప్పటి పరిస్థితుల్లో అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేయాల్సి వచ్చేది. ప్రతిభను మళ్లీ మళ్లీ నిరూపించుకోవాల్సి వచ్చేది. అందుకే చిరంజీవి కథలో మొదటి లెసన్ ఒక్కటే.. టాలెంట్ మనలో ఉండొచ్చు.. కానీ డిసిప్లిన్ దాన్ని బయటకు తీసుకొస్తుంది.