భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

26, ఆగస్టు 2026, బుధవారంభారత్ సమాచార్

ప్రకృతి సాగు, పంట మార్పిడితో రైతులకు మేలు

WhatsApp Image 2026-08-25 at 3.51.26 PM

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: డోర్నకల్ మండలం గొల్లచర్ల రైతు వేదికలో ఆత్మ కమిటీ ఆధ్వర్యంలో రైతు శిక్షణా తరగతులను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆత్మ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రసాయన ఎరువులు, పురుగుమందులను అధిక మోతాదులో వినియోగించకుండా ప్రకృతి సాగు, పంట మార్పిడి విధానాలను పాటించడం ద్వారా రైతులు సాగును లాభసాటిగా మార్చుకోవచ్చని సూచించారు. తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడులు సాధించేందుకు ప్రకృతి వ్యవసాయం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.

ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు నీటి లభ్యతకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని సుధాకర్ రెడ్డి సూచించారు. చెరువులు, కుంటల్లో నీరు లేకపోవడం, భూగర్భజలాలు అడుగంటిపోతుండటం, జలాశయాల నుంచి నీటి విడుదలకు అవకాశం లేకపోవడంతో వరి సాగును తగ్గించుకోవాలని కోరారు. తక్కువ నీటితో సాగయ్యే పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాలు, కూరగాయల వంటి ఆరుతడి పంటలపై రైతులు దృష్టి సారించాలని సూచించారు.

రసాయనాల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులతో ప్రకృతి సాగు చేపట్టడం ద్వారా సాగు పెట్టుబడులను తగ్గించుకోవచ్చని ఆయన తెలిపారు. అధిక రసాయన అవశేషాలు కలిగిన పంటలకు అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ తగ్గి రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా నాణ్యమైన పంటలను ఉత్పత్తి చేయడంతో పాటు వినియోగదారులకు ఆరోగ్యకరమైన ఆహారం అందించవచ్చని అన్నారు. పంట మార్పిడి విధానంతో భూసారాన్ని కాపాడుకోవడంతో పాటు వివిధ రకాల పంటల సాగుతో రైతులకు, సమాజానికి ప్రయోజనం కలుగుతుందని వివరించారు.

మండల వ్యవసాయ అధికారి అనిల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టెక్నికల్ ఏవో శ్రీదేవి, సర్పంచ్ బానోత్ శంకర్ నాయక్, ఏఈవోలు పవన్, వినాష్, ఆత్మ డైరెక్టర్లు వెంకట్ రెడ్డి, అనంతరెడ్డి, డాక్టర్ నాగేశ్వరరావు, రవి తదితరులు పాల్గొన్నారు. రైతులకు ప్రకృతి సాగు, పంటల ఎంపిక, పంట మార్పిడి విధానాలపై అవగాహన కల్పించారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలని అధికారులు సూచించారు.