భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని బాసరతో పాటు జిల్లాలోని అన్ని పుష్కర ఘాట్ల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. పుష్కరాల సందర్భంగా రోజుకు సుమారు 2.5 నుంచి 3 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఇప్పటి నుంచే శాఖల వారీగా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని సూచించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి గోదావరి పుష్కరాల నిర్వహణ, బాసర నూతన ఆలయ నిర్మాణం, మాస్టర్‌ప్లాన్, ఇరిగేషన్ తదితర అంశాలపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
బాసర మాస్టర్‌ప్లాన్ పనులను వేగవంతం చేయాలి
బాసర మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా సుమారు రూ.354 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. పనులకు 30 నెలల కాంట్రాక్టు వ్యవధి ఉన్నప్పటికీ పుష్కరాల ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని అత్యవసర, కీలక పనులను ఎనిమిది నెలల్లోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూసేకరణకు సంబంధించిన ప్రతిపాదనలను త్వరితగతిన పరిష్కరించి తదుపరి ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున తాగునీరు, మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు, పార్కింగ్, రవాణా తదితర మౌలిక వసతులను అవసరమైన స్థాయిలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రోజుకు మూడు లక్షల మంది భక్తులకు సరిపడేలా తాగునీటి సరఫరాకు ముందస్తు ప్రణాళిక రూపొందించాలని, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, బ్యాకప్ సదుపాయాలపై సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.
భక్తుల భద్రత, ఆరోగ్యానికి ప్రాధాన్యం
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ప్రాంతాలు, వాహనాల రాకపోకలకు ప్రత్యేక మార్గాలు, అవసరమైన చోట వన్‌వే, డైవర్షన్ తదితర అంశాలపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. బాసరతో పాటు జిల్లాలోని అన్ని పుష్కర ఘాట్ల వద్ద అత్యవసర వైద్య సేవలతో కూడిన వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, అవసరమైన వైద్య సిబ్బంది, మందులు, అంబులెన్స్‌లను ముందుగానే సిద్ధంగా ఉంచాలని సూచించారు. పుష్కరాల సమయంలో పారిశుద్ధ్య నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, పంచాయతీల పరిధిలో పారిశుద్ధ్య సిబ్బంది, వాహనాలు, చెత్త తరలింపు తదితర అంశాలపై ముందస్తు కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. డీపీఓ, డీఎంహెచ్ఓలు పరస్పర సమన్వయంతో పనిచేసి పారిశుద్ధ్యం, ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అక్రమ నిర్మాణాలపై చర్యలు.. పటిష్ట పోలీసు బందోబస్తు
జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదేశాల మేరకు బాసరలోని అక్రమ, అనధికార నిర్మాణాలను గుర్తించి నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో నిర్మాణాల తొలగింపు, భూసేకరణ ప్రక్రియలను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే నేపథ్యంలో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. 24 గంటలపాటు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టి కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిరంతర నిఘా కొనసాగిస్తామని తెలిపారు. బాసర నూతన ఆలయ నిర్మాణ పనులను కూడా ప్రణాళిక ప్రకారం వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, బైంసా సబ్‌కలెక్టర్ అజ్మీరా సంకేత్‌కుమార్, ఏఎస్పీ సాయి కిరణ్, నీటిపారుదల, ఆర్అండ్బీ, ఆర్డబ్ల్యూఎస్, పీఆర్ ఈఈలు అనిల్, సుభాష్, సందీప్, బాసర ఆలయ ఈఓ అంజనా దేవి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.