భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: చారిత్రాత్మక పరిణామాలతో 2026 సంవత్సరం తెలంగాణ పోలీసు శాఖ పోరాటంలో కీలక మలుపుగా మారింది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ), గ్రేహౌండ్స్, జిల్లా పోలీసుల సమన్వయంతో చేపట్టిన వ్యూహాత్మక చర్యల ఫలితంగా ఈ ఏడాది ఇప్పటివరకు రికార్డు స్థాయిలో మొత్తం 266 మంది అజ్ఞాత మావోయిస్టులు హింసామార్గాన్ని వీడి పోలీసుల ఎదుట లొంగిపోయారు.
ఈ ఏడాది లొంగిపోయిన వారిలో ముగ్గురు కేంద్ర కమిటీ సభ్యులు, 12 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక ప్రాంతీయ కమిటీ సభ్యుడు, 25 మంది డివిజనల్ కమిటీ కార్యదర్శులు, సభ్యులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరితో పాటు 94 మంది ఏరియా కమిటీ సభ్యులు, 131 మంది సాధారణ మావోయిస్టులు లొంగిపోయినట్లు వెల్లడించారు. దీంతో మావోయిస్టు పార్టీ నెట్వర్క్ అగ్రస్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు పూర్తిగా ఛిన్నాభిన్నమైన పరిస్థితి ఏర్పడిందని పోలీసు అధికారులు పేర్కొన్నారు.
ప్రస్తుతం తెలంగాణకు చెందిన వారిలో బయటి రాష్ట్రాల్లో పనిచేస్తున్న ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు (గణపతి), జడె రత్నబాయి (సుజాత), వార్త శేఖర్ (మంగు) అనే ముగ్గురు నేతలు మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారని పోలీసులు ధ్రువీకరించారు. నక్కా సుశీలరాణి లొంగుబాటుతో మావోయిస్టు పార్టీ మరింత బలహీనపడిందని అధికారులు పేర్కొన్నారు.
అజ్ఞాతంలో ఉన్న మిగిలిన మావోయిస్టులు కూడా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న లొంగుబాటు, పునరావాస విధానాన్ని సద్వినియోగం చేసుకుని సాధారణ జనజీవన స్రవంతిలో కలవాలని పోలీసు శాఖ విజ్ఞప్తి చేసింది.