భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సంబరాలు వలిగొండ మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో ఘనంగా కొనసాగుతున్నాయి. పల్లెల్లో వీధివీధినా పూల సోయగాలు, బతుకమ్మ పాటలతో పండుగ వాతావరణం నెలకొంది.
ఆడపడుచులు వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయ పాటలు పాడుతూ, ఆటపాటలతో సందడి చేస్తున్నారు. మహిళల కోలాహలంతో గ్రామాల్లో పండుగ శోభ కనిపిస్తోంది.
తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతితో మనకున్న అనుబంధానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలను మహిళలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ తెలంగాణ సంస్కృతి వైభవాన్ని చాటిచెబుతున్నారు.