భారత్ సమాచార్, మేడ్చల్ జిల్లా: కీసర మండలం చేర్యాల పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను కాలనీవాసులు ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు, భక్తులు ఉత్సాహంగా ప్రారంభించారు.
వివిధ రకాల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, పసుపుతో గౌరమ్మను తయారు చేసి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. తంగేడు, గునుగు తదితర పూలతో బతుకమ్మలను అలంకరించి, పసుపు, కుంకుమలతో గౌరమ్మను పూజిస్తూ భారతీయ సంప్రదాయాలను చాటుకున్నారు.
తొమ్మిది రోజుల పాటు వరుసగా బతుకమ్మ వేడుకలను నిర్వహించి, చివరి రోజు సద్దుల బతుకమ్మ పండుగతో సంబరాలను ముగించనున్నట్లు కాలనీవాసులు తెలిపారు. పండుగలో భాగంగా బతుకమ్మలను కొందరు చెరువుల్లో, మరికొందరు తమ ఇళ్ల ముందు ఏర్పాటు చేసుకున్న నీటి తొట్టెల్లో నిమజ్జనం చేశారు.
తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతితో ముడిపడిన సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రతి సంవత్సరం ఇలాగే ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని బతుకమ్మ భక్తులు ఆకాంక్షించారు.