భారత్ సమాచార్, మెదక్ జిల్లా: దసరా పండుగ సెలవుల నేపథ్యంలో ప్రజలు ప్రయాణాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచించారు. పండుగలను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని, చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు జరిగి పండుగ వాతావరణం విషాదంగా మారకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
పిల్లల భద్రత తల్లిదండ్రుల బాధ్యత
దసరా సెలవుల్లో పిల్లలు చెరువులు, కుంటలు, కాలువలు, బావులు, ఈత కొలనుల వద్దకు ఒంటరిగా వెళ్లకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎస్పీ సూచించారు. పిల్లలు ఈతకు వెళ్లే సమయంలో పెద్దలు తప్పనిసరిగా తోడుండాలని తెలిపారు. నీటి లోతు తెలియని ప్రాంతాల్లోకి దిగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పిల్లల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ వారి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి
పండుగల సందర్భంగా సొంతూళ్లకు, ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేవారు ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఎస్పీ సూచించారు. బైక్‌పై ప్రయాణించే వారు హెల్మెట్ ధరించాలని, కార్లలో వెళ్లేవారు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని స్పష్టం చేశారు. అతివేగం, ర్యాష్ డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని, ప్రయాణ సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు
మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని ఎస్పీ కోరారు. రోడ్డు భద్రత విషయంలో నిర్లక్ష్యం చేయకుండా తమతో పాటు ఇతరుల ప్రాణాల రక్షణకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. పోలీసుల సూచనలు పాటిస్తూ వ్యక్తిగత భద్రతతో పాటు కుటుంబ సభ్యుల రక్షణపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.
దసరా, బతుకమ్మ పండుగలను ప్రజలందరూ సంతోషంగా, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ ఆకాంక్షించారు. ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని, పండుగ వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.