భారత్ సమాచార్, కొత్తగూడెం జిల్లా: రోడ్డు ప్రమాదంలో కుమారుడిని కోల్పోయిన ఓ కుటుంబం.. అలాంటి విషాదం మరొక కుటుంబానికి ఎదురుకాకూడదనే ఉద్దేశంతో ముందడుగు వేసింది. హెల్మెట్ లేకపోవడం వల్ల తన కుమారుడికి జరిగిన ప్రమాదం మరొకరికి జరగకూడదని భావించిన తల్లిదండ్రులు, కుమారుడి దశదిన కర్మ సందర్భంగా 50 మంది యువకులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. సుజాతనగర్ మండలం వేపలగడ్డలో నిర్వహించిన ఈ కార్యక్రమం రోడ్డు భద్రత ప్రాధాన్యతను చాటిచెప్పింది.
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి
వేపలగడ్డకు చెందిన రుంకు సత్యనారాయణ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఇటీవల ఆయన బైక్‌పై ప్రయాణిస్తుండగా కుక్క అడ్డురావడంతో ప్రమాదం చోటుచేసుకుంది. కొత్తగూడెంలోని విద్యానగర్‌లో ఓ ప్రైవేట్ హాస్పిటల్ సమీపంలో బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో సత్యనారాయణ మృతిచెందారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
మరో కుటుంబానికి ఈ బాధ కలగకూడదని..
కుమారుడిని కోల్పోయిన తండ్రి రుంకు అప్పన్న, తల్లి హైమావతి తమకు ఎదురైన విషాదం మరెవరికీ ఎదురుకాకూడదని నిర్ణయించుకున్నారు. హెల్మెట్ ధరించి ఉంటే ప్రమాద సమయంలో ప్రాణాలను కాపాడుకునే అవకాశం ఉండేదనే ఆలోచనతో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని భావించారు. కుటుంబ స్నేహితుల సహకారంతో కుమారుడి దశదిన కర్మ సందర్భంగా 50 మంది యువకులకు హెల్మెట్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
సత్యనారాయణకు డీఎస్పీ నివాళి
ఈ కార్యక్రమానికి కొత్తగూడెం DSP ఆదినారాయణ హాజరయ్యారు. సత్యనారాయణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మృతుడి తల్లిదండ్రులు, స్నేహితులను ఓదార్చి ధైర్యం చెప్పారు. కుమారుడి జ్ఞాపకార్థం హెల్మెట్లు పంపిణీ చేయాలనే నిర్ణయం తీసుకున్న కుటుంబ సభ్యులను అభినందించారు.
హెల్మెట్‌తోనే ప్రయాణం సురక్షితం
ఈ సందర్భంగా DSP ఆదినారాయణ మాట్లాడుతూ.. బైక్‌పై ప్రయాణించేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు, ఎలా జరుగుతాయో చెప్పలేమని, చిన్నపాటి నిర్లక్ష్యం కూడా తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చని తెలిపారు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాద సమయంలో తలకు గాయాలయ్యే ముప్పు తగ్గి, ప్రాణాలను కాపాడుకునే అవకాశం పెరుగుతుందని చెప్పారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ తమ భద్రతతో పాటు ఇతరుల ప్రాణాల రక్షణకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
స్నేహితుడి జ్ఞాపకార్థం యువకులకు హెల్మెట్లు అందించి, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు స్నేహితులు చూపిన చొరవ అభినందనీయమని DSP పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సందేశాన్ని గుర్తుంచుకుని హెల్మెట్ ధరించే అలవాటును తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వన్ టౌన్ CI జితేందర్, టూ టౌన్ CI యాసిన్, త్రీ టౌన్ CI ఇంద్రసేనారెడ్డి, ట్రాఫిక్ SI గడ్డం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.