భారత్ సమాచార్, మెదక్ జిల్లా: గ్రామాల్లో రీసర్వే ప్రక్రియను పక్కా ప్రణాళికతో చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ రెవెన్యూ, సర్వే అధికారులను ఆదేశించారు. రీసర్వే సమయంలో రైతులకు ఎలాంటి సందేహాలు ఉన్నా వాటిని నివృత్తి చేస్తూ, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ, సర్వే అధికారులతో నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్ రీసర్వే పురోగతి, అధికారుల బాధ్యతలపై సమీక్షించారు.
రైతులకు రీసర్వేపై అవగాహన కల్పించాలి
ఈ సందర్భంగా నగేష్ మాట్లాడుతూ.. గ్రామాల్లో రీసర్వే నిర్వహణలో సర్వే, రెవెన్యూ అధికారుల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. రీసర్వే ప్రక్రియపై రైతులకు పూర్తి అవగాహన కల్పించాలని, వారికి ఎదురయ్యే సందేహాలను ఓపికగా విని స్పష్టమైన సమాధానాలు ఇవ్వాలని సూచించారు. రీసర్వేకు సంబంధించిన వివరాలను రైతులకు అర్థమయ్యేలా వివరించడం ద్వారా ప్రక్రియను సజావుగా ముందుకు తీసుకెళ్లవచ్చని పేర్కొన్నారు.
9(2) నోటీసుల అభ్యంతరాలను పరిష్కరించాలి
ఇప్పటికే రీసర్వే నిర్వహించిన గ్రామాల్లో 9(2) నోటీసులు అందుకున్న వారి నుంచి వచ్చిన అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అధికారులకు సూచించారు. రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా, నిబంధనల ప్రకారం వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
రీసర్వే కార్యక్రమాన్ని రెవెన్యూ, సర్వే శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో నిర్వహించాలని చెప్పారు. ముందస్తు ప్రణాళికతో బాధ్యతలు నిర్వర్తించినప్పుడే ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంతో పాటు, వారి సందేహాలను సమర్థవంతంగా నివృత్తి చేయగలమని నగేష్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో DRO అంబాదాస్ రాజేశ్వర్, ఏడీ సర్వే కిషన్, రెవెన్యూ డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, సీనియర్ అసిస్టెంట్లు, సర్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు.