భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ప్రజలకు ప్రభుత్వ సేవలు సక్రమంగా అందుతున్నాయా? అధికారులు విధులను బాధ్యతగా నిర్వహిస్తున్నారా? అనే అంశాలపై జిల్లా కలెక్టర్, మెజిస్ట్రేట్ స్నేహ శబరిష్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా గూడూరు మండలంలోని బొద్దుగొండ, మదనాపురం గ్రామాల్లో పర్యటించి ఓటరు జాబితా సవరణ, భూముల రీ సర్వే పనులను పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సేవలపై సమీక్షించారు.
SIR ప్రక్రియపై క్షేత్రస్థాయి పరిశీలన
ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించనున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం (SIR) నేపథ్యంలో గ్రామాల్లో చేపడుతున్న మార్పులు, చేర్పుల ప్రక్రియను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఓటరు జాబితా సవరణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిబంధనల ప్రకారం పనులు చేపట్టాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.
భూముల రీ సర్వే పారదర్శకంగా జరగాలి
మదనాపురం గ్రామంలో కొనసాగుతున్న భూముల రీ సర్వే పనులను కలెక్టర్ పరిశీలించి, ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం సర్వే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సర్వేకు ముందుగానే రైతులకు సమాచారం అందించాలని సూచించారు. రైతులు కూడా తమ భూముల హద్దులను ముందుగా నిర్ధారించుకోవడం ద్వారా సర్వే ప్రక్రియ సులభంగా, పారదర్శకంగా సాగుతుందని తెలిపారు.
ప్రస్తుత ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటల మార్పిడి విధానాన్ని అనుసరించాలని, నీటి వినియోగం తక్కువగా ఉండే పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. VBG రాంజీ ఉపాధి హామీ పథకం కింద రైతులకు ఉపయోగపడే వివిధ పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్ను ఆదేశించారు.
మండలంలో సాగునీరు, తాగునీటి సరఫరాలో సమస్యలు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా అర్హులైన రైతులందరికీ పంట రుణాలు అందేలా చూడాలని సూచించారు.
SIR తుది జాబితాలో పేరు కోసం మరో అవకాశం
ఈ ఏడాది నవంబర్ 9న ప్రకటించనున్న SIR ఓటరు తుది జాబితాలో పేరు చేర్చుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించిందని కలెక్టర్ స్నేహ శబరిష్ తెలిపారు. ఈ నెల 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నట్లు ఆమె వెల్లడించారు.
ఈ శిబిరాల్లో కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవడంతో పాటు, ముసాయిదా ఓటరు జాబితా ప్రక్రియలో భాగంగా ASD (Absent, Shifted, Dead and Duplicate) కేటగిరీ కింద తొలగించిన పేర్లలో పొరపాటున తొలగింపునకు గురైన అర్హులైన ఓటర్లు కూడా తిరిగి తమ పేర్ల నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఇందుకోసం ఫారం-6 సమర్పించాల్సి ఉంటుందని వివరించారు.
గతంలో SIR ప్రక్రియలో ఫిర్యాదులు, అభ్యంతరాల సమయంలో ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 వరకు అవకాశం కల్పించారని పేర్కొన్నారు. ఆ గడువు ముగిసినప్పటికీ, తాజాగా అక్టోబర్ 15, 16 తేదీల్లో ప్రత్యేక శిబిరాల ద్వారా మరోసారి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. ఈ రెండు రోజుల్లో ఫారం-6 సమర్పించిన అర్హులైన వారి పేర్లను నవంబర్ 9న ప్రకటించే తుది జాబితాలో చేర్చేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. అర్హులైన పౌరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఆకస్మిక తనిఖీ
అనంతరం గూడూరు మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని పిల్లల వార్డు, మహిళల వార్డు, పురుషుల వార్డులను పరిశీలించారు. మందుల నిల్వ గది, OP రిజిస్టర్, హాజరు పట్టికతో పాటు CCTVs పనితీరును తనిఖీ చేశారు.
వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. రోగులకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని, ప్రతి ఒక్కరూ మీ ప్రమాణం యాప్లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని ఆదేశించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులు, ఇతర రోగులను ఆప్యాయంగా పలకరించి, వారికి అందుతున్న వైద్య సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి
కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పరిధిలోని అన్ని సబ్ సెంటర్లలో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వైద్య కార్యక్రమాలను నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ప్రజలకు అందించాలని సూచించారు. ఆసుపత్రిలో ఎక్స్రే, ల్యాబ్తో పాటు అవసరమైన ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు.
విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్య సేవల్లో నాణ్యత పెంచడంతో పాటు, ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే సామాన్య ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని సిబ్బందికి సూచించారు.
ఈ పర్యటనలో ల్యాండ్ సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ చీర శ్రీనివాసులు, స్థానిక తహసీల్దార్ నాగ భవాని, రెవెన్యూ ఇన్స్పెక్టర్ నరేష్ రెడ్డి, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.