భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను లబ్ధిదారులు త్వరితగతిన ప్రారంభించాలని ప్రత్యేక అధికారి సీహెచ్ సురేష్, మెదక్ CPO సూచించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని రాయిలాపూర్, సుతార్పల్లి గ్రామాల్లో వారు పర్యటించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాలు ఇంకా ప్రారంభించని లబ్ధిదారులతో మాట్లాడి, ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణ పనులను వీలైనంత త్వరగా చేపట్టాలని సూచించారు.
ఇళ్ల నిర్మాణాల్లో జాప్యం చేయొద్దు
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లు మంజూరైన అర్హులైన లబ్ధిదారులు ఎలాంటి జాప్యం చేయకుండా నిర్మాణ పనులను ప్రారంభించాలని అధికారులు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇళ్ల నిర్మాణాలను దశలవారీగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. నిర్మాణాలు ప్రారంభించని లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని, పనులు ప్రారంభించేలా అవగాహన కల్పించారు. ఇళ్ల నిర్మాణాల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.
పాఠశాల అభివృద్ధి పనుల పరిశీలన
అనంతరం సుతార్పల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను అధికారులు సందర్శించారు. పాఠశాలలో చేపడుతున్న అదనపు సదుపాయాల కల్పన, ప్రహరి గోడ, మరుగుదొడ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో షాజీలోద్దీన్, APO, టెక్నికల్ అసిస్టెంట్లు (TAs), గ్రామ సర్పంచ్, ఇతర సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.