భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

21, అక్టోబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి: కలెక్టర్

పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి: కలెక్టర్

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని, ప్రజల రక్షణ కోసం ప్రాణాలర్పించిన వీరుల సేవలను సమాజం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. బుధవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఐపీఎస్‌తో కలిసి పాల్గొన్నారు. ముందుగా అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలు సమర్పించి నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించి అమరుల త్యాగాలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజల భద్రత కోసం పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలందించిన అమరవీరులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాల సమయంలోనూ పోలీసులు ప్రజలకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. మారుతున్న నేర స్వరూపానికి అనుగుణంగా ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ సైబర్ నేరాలను అరికట్టేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. జిల్లాలో శాంతియుత వాతావరణం నెలకొన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి: కలెక్టర్

జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ మెదక్ జిల్లాలో ఇప్పటివరకు 14 మంది పోలీసులు సంఘ విద్రోహ శక్తుల చేతుల్లో ప్రాణత్యాగం చేసి అమరులయ్యారని తెలిపారు. ప్రజల రక్షణ, దేశ సమగ్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం వారు చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. అమరవీరుల స్ఫూర్తితో ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలని సూచించారు. అమరుల కుటుంబాల త్యాగాలను సమాజం గుర్తించాలని, వారి కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

అనంతరం కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు అమరవీరుల కుటుంబ సభ్యులకు గిఫ్ట్ ప్యాక్‌లు అందజేసి గౌరవించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, సీఐలు, ఎస్‌హెచ్‌ఓలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.