భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

23, అక్టోబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తే కఠిన చర్యలు: ఎస్సై నరేష్

ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తే కఠిన చర్యలు: ఎస్సై నరేష్

భారత్ సమాచార్, మహబూబాబాద్ : వైద్యుల ప్రిస్క్రిప్షన్ (మందుల చీటీ) లేకుండా నిబంధనల ప్రకారం విక్రయించాల్సిన మందులను విక్రయించవద్దని ఇనుగుర్తి ఎస్సై పి. నరేష్ మెడికల్ షాపుల నిర్వాహకులకు సూచించారు. జిల్లా ఎస్పీ శబరిష్ ఆదేశాల మేరకు శుక్రవారం మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలోని మెడికల్ స్టోర్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మందుల విక్రయ విధానం, నిబంధనల అమలు, వినియోగదారులకు మందులు అందించే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై షాపుల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.

ముఖ్యంగా వైద్యుల ప్రిస్క్రిప్షన్ అవసరమైన నిద్ర మాత్రలు, మత్తు కలిగించే ఔషధాలను సరైన వైద్య పత్రాలు లేకుండా విక్రయించకూడదని ఎస్సై స్పష్టం చేశారు. మందుల విక్రయానికి సంబంధించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, అనుమతి లేని విధంగా ఔషధాలను విక్రయించడం వల్ల ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం కలిగే అవకాశం ఉందని తెలిపారు. మెడికల్ షాపుల నిర్వాహకులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, ఔషధాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరించాలని కోరారు.

ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తే కఠిన చర్యలు: ఎస్సై నరేష్

యువతలో కొందరు నిద్ర మాత్రలు, మత్తు కలిగించే మందులను దుర్వినియోగం చేస్తూ వ్యసనాలకు గురవుతున్నారని ఎస్సై నరేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి అలవాట్లు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపడమే కాకుండా కుటుంబాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మెడికల్ షాపుల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పదంగా మందుల కొనుగోలు జరిగితే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.

నిబంధనలను ఉల్లంఘిస్తూ మందులు విక్రయించే మెడికల్ షాపులపై సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. అవసరమైతే లైసెన్సుల రద్దుకు సంబంధిత ఔషధ నియంత్రణ అధికారులకు సిఫారసు చేస్తామని తెలిపారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ, యువతను మత్తు పదార్థాల దుర్వినియోగం నుంచి కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, పోలీసులకు మెడికల్ షాపుల నిర్వాహకులు సహకరించాలని కోరారు.