భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: బాసర రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ)లో తాగునీటి సమస్య విద్యార్థుల చదువుపై ప్రభావం చూపుతోంది. క్యాంపస్‌కు నీటి సరఫరా నిలిచిపోవడంతో యూనివర్సిటీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన సెమిస్టర్-1 ఆన్‌లైన్, బ్లెండెడ్, హైబ్రిడ్ మోడ్ షెడ్యూల్‌ను విడుదల చేసింది.
మూడు మోటార్లు పాడవడంతో నీటి సరఫరా బంద్
గోదావరి నది నుంచి బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌కు తాగునీటిని సరఫరా చేసే ఇన్‌టేక్ వెల్ వద్ద ఉన్న మూడు మోటార్లు పాడవడంతో ఈ సమస్య తలెత్తింది. మోటార్లు పనిచేయకపోవడంతో క్యాంపస్‌కు నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో విద్యార్థులకు తాగునీటి ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఏర్పడింది. ఎల్‌నినో ప్రభావంతో నీటి సమస్యలు మరింత ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో క్యాంపస్‌లో సాధారణ పరిస్థితులు ఎప్పుడు నెలకొంటాయన్నది ప్రశ్నార్థకంగా మారింది.
నవంబర్ 17 వరకు ఆన్‌లైన్ తరగతులు
నీటి సరఫరా పునరుద్ధరణకు నెల రోజుల వరకు సమయం పట్టే అవకాశం ఉందని మిషన్ భగీరథ బృందం స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో ఇప్పటికే దసరా సెలవులను పొడిగించిన యూనివర్సిటీ యాజమాన్యం తాజాగా ఆన్‌లైన్ తరగతుల నిర్వహణకు సిద్ధమైంది. విడుదల చేసిన కొత్త షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 26 నుంచి పీయూసీ-1 మొదలుకొని ఈ-4 వరకు విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు ప్రారంభం కానున్నాయి. నవంబర్ 17 నాటికి ఆన్‌లైన్‌లోనే సిలబస్ పూర్తి చేయాలని నిర్ణయించారు.
విద్యార్థుల రాకపై ప్రత్యేక మార్గదర్శకాలు
తరగతుల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తూనే, విద్యార్థులు తిరిగి క్యాంపస్‌కు వచ్చే తేదీలకు సంబంధించి యాజమాన్యం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. ఆన్‌లైన్, బ్లెండెడ్, హైబ్రిడ్ మోడ్‌లలో తరగతుల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించింది.
క్యాంపస్‌లో తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో విద్యార్థుల విద్యా కార్యకలాపాలను ఆన్‌లైన్‌కు మార్చాల్సి రావడం చర్చనీయాంశంగా మారింది. నవంబర్ 17 వరకు తరగతుల నిర్వహణలో మార్పులు చేయడంతో, నీటి సరఫరా పునరుద్ధరణపై విద్యార్థులు, తల్లిదండ్రులు దృష్టి సారిస్తున్నారు.