భారత్ సమాచార్, మేడ్చల్ జిల్లా: మల్కాజిగిరి డివిజన్ పరిధిలోని బాల సరస్వతి నగర్, నరసింహారెడ్డి నగర్ కాలనీల్లో వీధి దీపాలు వెలగక స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు పరిష్కారం లభించింది. ఈ సమస్యను కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు జీడీ సంపత్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడారు. వీధి దీపాల విభాగం DE, AEలతో చర్చించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. దీంతో ఆయా కాలనీల్లో వీధి దీపాలు ఏర్పాటు చేయడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా జీడీ సంపత్ గౌడ్ మాట్లాడుతూ.. మల్కాజిగిరి డివిజన్ పరిధిలోని కాలనీలు, బస్తీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి చొరవ చూపుతున్నామని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.
మల్కాజిగిరి మాజీ MLA మైనంపల్లి హనుమంతరావు సహకారంతో డివిజన్‌తో పాటు నియోజకవర్గ పరిధిలోని ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుకు సాగుతున్నామని జీడీ సంపత్ గౌడ్ పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానికులు మనోహర్, యాదగిరి గౌడ్, మహేష్, రామచందర్, పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.