భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

29, అక్టోబర్ 2026, గురువారంభారత్ సమాచార్

బాల్య వివాహాల నిర్మూలన, పారిశుద్ధ్యంపై అవగాహన

బాల్య వివాహాల నిర్మూలన, పారిశుద్ధ్యంపై అవగాహన

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: బాలికల రక్షణ, బాలల హక్కుల పరిరక్షణతో పాటు బాల్య వివాహాల నిర్మూలన, పరిసరాల పరిశుభ్రతపై విద్యార్థినుల్లో అవగాహన పెంపొందించేందుకు మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల విద్యాలయంలో గురువారం బేటి పడావో బేటి బచావో కార్యక్రమంలో భాగంగా ఈ అవగాహన కార్యక్రమం జరిగింది. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల/కళాశాల ప్రిన్సిపాల్ అధ్యక్షతన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జిల్లా సంక్షేమ అధికారి శిరీష ముఖ్య అతిథిగా, ICDS సూపర్వైజర్ దుర్గా విశిష్ట అతిథిగా హాజరయ్యారు. విద్యార్థినులకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. చెత్త ఉత్పత్తిని తగ్గించడం, పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని, ప్రత్యేక వ్యర్థాలను సాధారణ చెత్తలో కలపకుండా సురక్షితంగా సేకరించి, నిబంధనల ప్రకారం సరైన విధానంలో పారవేయాలని సూచించారు.

బాల్య వివాహాల నిర్మూలన, పారిశుద్ధ్యంపై అవగాహన

బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన

బాల్య వివాహాల వల్ల ఎదురయ్యే సమస్యలు, వాటి నివారణకు ఉన్న చట్టపరమైన నిబంధనల గురించి అధికారులు విద్యార్థినులకు వివరించారు. బాల్య వివాహ నిషేధ చట్టం, POCSO చట్టంపై అవగాహన కల్పించారు. బాలికల రక్షణ, బాలల హక్కులను కాపాడటం, బాల్య వివాహాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

బాల్య వివాహాల నిర్మూలన, పారిశుద్ధ్యంపై అవగాహన

విద్యార్థినులు పరిశుభ్రతను తమ రోజువారీ జీవితంలో భాగంగా చేసుకోవాలని, పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేయాలని అధికారులు పిలుపునిచ్చారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. బాల్య వివాహాల వంటి సమస్యలపై అవగాహన పెంచుకుని, బాలికల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ మహేశ్వరి, జెండర్ స్పెషలిస్ట్ అరుణ, ఫైనాన్షియల్ లిటరసీ ప్రతినిధి సంధ్యారాణి, పాఠశాల/కళాశాల సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.