భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

30, అక్టోబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవండి: మెదక్ ఎస్పీ

రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవండి: మెదక్ ఎస్పీ

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడటం ఎంతో గొప్ప సేవ అని, రక్తదాతలు మరొకరికి ప్రాణదానం చేసిన దేవుళ్లతో సమానమని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు IPS అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం రామాయంపేటలో నిర్వహించిన రక్తదాన, ఉచిత వైద్య శిబిరాలను ఆయన ప్రారంభించారు. లయన్స్ క్లబ్, తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ ఆధ్వర్యంలో, రామాయంపేట సర్కిల్ పోలీసుల సహకారంతో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.

రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవండి: మెదక్ ఎస్పీ

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రక్తం అవసరమైన సమయంలో సకాలంలో అందకపోవడం వల్ల ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుందని తెలిపారు. అలాంటి సమయంలో రక్తదాతలు ముందుకొచ్చి రక్తాన్ని అందించడం ద్వారా విలువైన ప్రాణాలను కాపాడవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానంపై అవగాహన పెంచుకుని, వీలైనప్పుడల్లా ఈ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవండి: మెదక్ ఎస్పీ

మెదక్ జిల్లాలో విధులు నిర్వహిస్తూ సంఘ విద్రోహ శక్తుల దాడుల్లో 14 మంది పోలీసులు అమరులయ్యారని ఎస్పీ గుర్తుచేశారు. ప్రజల భద్రత కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించిన వారి సేవలు ఎప్పటికీ మరువలేనివని తెలిపారు. అమరులైన పోలీసుల కుటుంబాలకు జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ప్రస్తుతం సమాజానికి డ్రగ్స్, సైబర్ నేరాలు పెద్ద సవాలుగా మారుతున్నాయని ఎస్పీ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా యువత మాదకద్రవ్యాలకు ఆకర్షితులు కాకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని చెప్పారు. అలాగే ఆన్‌లైన్ మోసాలు, సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, అనుమానాస్పద లింకులు, ఫోన్ కాల్స్ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవండి: మెదక్ ఎస్పీ

అనంతరం రామాయంపేట పోలీసులు నిర్వహించిన బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో విజయం సాధించిన క్రీడాకారులకు ఎస్పీ బహుమతులు అందజేశారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, పట్టుదలను పెంపొందిస్తాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవండి: మెదక్ ఎస్పీ

ఇదే కార్యక్రమంలో షీ టీమ్స్ అవగాహన, సైబర్ భద్రత అంశాలపై పోలీస్ కానిస్టేబుల్ ప్రసాద్ రచించిన పాటలను ఎస్పీ ఆవిష్కరించారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు పాటల రూపంలో సందేశాలను అందించడం అభినందనీయమని పేర్కొంటూ కానిస్టేబుల్ ప్రసాద్‌ను ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో DSPలు ప్రసన్న కుమార్, నరేందర్ గౌడ్, CI సైదా, SIలు బాలరాజు, రాజేష్, శివానందం, చైతన్య కుమార్ రెడ్డి, సృజనతో పాటు పోలీసు సిబ్బంది, లయన్స్ క్లబ్ ప్రతినిధులు, తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ సభ్యులు, వైద్య సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.