భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

2, నవంబర్ 2026, సోమవారంభారత్ సమాచార్

పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి.. తహసీల్దార్‌కు వినతిపత్రం

మోడల్ స్కూల్ టీచర్స్ రెండో దశ నిరసన.. న్యాయమైన సమస్యల పై తహసిల్దార్ కు వినతి

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నెల్లికుదురు మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు సోమవారం రెండో దశ నిరసన చేపట్టారు. రాష్ట్ర మోడల్ స్కూల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మండల తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.

010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలి

ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. తమకు 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇంటర్మీడియట్ వరకు బోధిస్తున్న PGTలకు జూనియర్ లెక్చరర్ (JL) వేతన స్కేలు వర్తింపజేయాలని, GO నం.317ను వెంటనే అమలు చేయాలని కోరారు. ఉద్యోగులందరికీ ఆరోగ్య కార్డులు మంజూరు చేయడంతో పాటు, దీర్ఘకాలంగా తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న ఉపాధ్యాయులను క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు.

HBTలకు నెలకు ₹.35,000 వేతనం ప్రకటించాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరారు. చాలాకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించి, మోడల్ స్కూళ్లను వెంటనే ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

నవంబర్ నుంచి నిరసనలు ఉధృతం

తమ డిమాండ్ల సాధన కోసం నవంబర్ 4, 5 తేదీల్లో జిల్లా స్థాయిలో అధికారులకు వినతిపత్రాలు అందజేయనున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు. నవంబర్ 17న రాష్ట్రస్థాయి ధర్నా నిర్వహించేందుకు రాష్ట్ర మోడల్ స్కూల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు తమ నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీచర్లు ఎం.ఏ. అంజుమ్ సుల్తానా, బి. సక్రం, టి. సతీష్, టి. రాంనర్సయ్య, వై. నాగమోహన్ రావు, పి. యుగంధర్, సీహెచ్. జ్యోతి, బి. కవిత, ఎ. సునీత, బి. దేవేందర్, ఎన్. చంద్రు నాయక్ పాల్గొన్నారు.