భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

2, నవంబర్ 2026, సోమవారంభారత్ సమాచార్

దేవాలయాల తొలగింపుపై ఆగ్రహం.. ధర్నాకు గ్రామస్థుల హెచ్చరిక

గుట్టుచప్పుడు కాకుండామల్లన్న, ఎల్లమ్మ రెండు పురాతన గుళ్ల తొలగింపు..

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: దశాబ్దాలుగా గ్రామస్థులు పూజలు నిర్వహిస్తున్న రెండు పురాతన దేవాలయాలను తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తొలగించడంపై గుడి యజమానులు, గ్రామస్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామ పరిధిలో చోటుచేసుకుంది.

గ్రామ పరిధిలోని మల్లన్న, ఎల్లమ్మ దేవాలయాల్లో సుమారు 40 ఏళ్లుగా గ్రామస్థులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కొన్ని నెలల క్రితం ఈ దేవాలయాలు ఉన్న భూమిని TGIIIC స్వాధీనం చేసుకుని పరిశ్రమల ఏర్పాటుకు కేటాయించింది. ఆ భూమిలో కొనసాగుతున్న తోట కోల్డ్ పరిశ్రమ పరిధిలో ఈ రెండు దేవాలయాలు ఉండగా, తొలుత వాటిని అలాగే ఉంచారు. అనంతరం దేవాలయాల యజమానులతో చర్చలు జరిపి, విగ్రహాలను మరో ప్రాంతానికి తరలించి, ప్రత్యామ్నాయ స్థలంలో కొత్త దేవాలయాలు నిర్మించేందుకు అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది.

అయితే సోమవారం ఉదయం దేవాలయాల వద్దకు వెళ్లిన యజమానులు, గ్రామస్థులకు అక్కడ కనిపించిన దృశ్యం తీవ్ర ఆవేదన కలిగించింది. రెండు దేవాలయాలను తొలగించడంతో పాటు, వాటిలోని విగ్రహాలను పరిశ్రమలోని ఓ మూలన ఏర్పాటు చేసిన షెడ్డులో ఉంచినట్లు గుర్తించారు. ఈ తొలగింపు గురించి తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా పూజలు నిర్వహిస్తున్న దేవతా విగ్రహాలను ఆ స్థితిలో చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు.

40 ఏళ్లుగా పూజలు చేస్తున్నాం.. న్యాయం చేయాలి

సుమారు నాలుగు దశాబ్దాలుగా దేవాలయాలను నిర్మించుకుని పూజలు నిర్వహిస్తున్న తమకు కనీస సమాచారం ఇవ్వకుండా వాటిని ఎలా తొలగిస్తారని గుడి యజమానులు, గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, పరిశ్రమ నిర్వాహకులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

గతంలో దేవాలయాలు ఉన్న విధంగానే తిరిగి నిర్మించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. లేనిపక్షంలో గ్రామస్థులందరితో కలిసి పరిశ్రమ గేటు ఎదుట ధర్నా చేపడతామని హెచ్చరించారు. దేవాలయాల తొలగింపు ఘటనపై అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి వాస్తవాలను పరిశీలించాలని, తమకు న్యాయం చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.