భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

3, నవంబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

దళితులపై దాడులు ఆపాలి.. అట్రాసిటీ నిందితులను అరెస్టు చేయాలి

దళితులపై దాడులను అరికట్టాలి  ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో నిందితులను వెంటనే అరెస్టు చేయాలి

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ జిల్లాలో పండుగల వేళ దళితులపై జరుగుతున్న దాడులు, కులవివక్ష ఘటనలను అరికట్టాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బోనాలు, బతుకమ్మ, దసరా ఉత్సవాల సందర్భంగా దళితులపై దాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయడంతో పాటు, కులవివక్షకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు మంగళవారం నర్సాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ అనితకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు కల్లూరి సంజీవ, కేవీపీఎస్ జిల్లా నాయకుడు కడారి నాగరాజు, టీఎంఆర్పీఎస్ నియోజకవర్గ కన్వీనర్ కుమార్, జేఎంఎం రాష్ట్ర నాయకుడు ఊరట్ల శివ, మండల అధ్యక్షుడు గోవు యాదగిరి మాట్లాడుతూ.. మెదక్ జిల్లాలోని పలు గ్రామాల్లో పండుగల సందర్భంగా దళితులపై దాడులు, కులవివక్ష ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. పండుగలు అందరూ కలిసి జరుపుకోవాల్సిన సందర్భాల్లో దళితులను వేడుకలకు దూరంగా ఉంచడం, అవమానించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

మనోహరాబాద్ మండలం కోనాయపల్లి, శివ్వంపేట మండలం నవాబ్‌పేట గ్రామాల్లో బతుకమ్మ వేడుకల సందర్భంగా దాడులు జరిగినట్లు తెలిపారు. కుచారం గ్రామంలో దళిత మహిళా సర్పంచ్ నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఆమెను పాల్గొనకుండా అవమానించారని పేర్కొన్నారు. తూప్రాన్ మండలం వెంకటాయపల్లిలో బోనాల సందర్భంగా దళితులు ఆలయానికి వెళ్లే మార్గాన్ని మూసివేశారని ఆరోపించారు.

అలాగే వెల్దుర్తి మండలం ఎదులపల్లిలో దళిత మహిళా సర్పంచ్‌ను బతుకమ్మ వేడుకల్లో పాల్గొనకుండా అడ్డుకున్నారని, తూప్రాన్ మండలం కిష్టాపూర్‌లో బతుకమ్మ ఆడిన దళిత మహిళలను సాంఘిక బహిష్కరణకు గురిచేశారని తెలిపారు. హవేలి ఘనపూర్ మండలంలోనూ దళితులపై దాడి జరిగినట్లు వెల్లడించారు.

ఈ ఘటనలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదైనప్పటికీ, పోలీసుల విచారణలో నిర్లక్ష్యం కనిపిస్తోందని ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు. కేసుల్లో నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలో మరోసారి ఇలాంటి కులవివక్ష ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కఠినంగా వ్యవహరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జేఎంఎం జిల్లా ఉపాధ్యక్షుడు ఆనంద్, ఎంఎస్ఎఫ్ జిల్లా ఇన్‌చార్జి నాగరాజు, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు మన్నె భిక్షపతి, నరేష్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.