భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: అటవీ భూములు, సరిహద్దులను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే ఉపేక్షించేది లేదని ఫారెస్ట్ తొర్రూర్ రేంజ్ ఆఫీసర్ విజయలక్ష్మి స్పష్టం చేశారు. అటవీ ప్రాంతాల్లో అక్రమ చొరబాట్లను అరికట్టడంతో పాటు, రిజర్వ్ ఫారెస్ట్ భూములను పరిరక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
ఈ క్రమంలో మంగళవారం ఆమె ఆధ్వర్యంలో ఇనుగుర్తి మండలంలోని రిజర్వ్ ఫారెస్ట్ ఇనుగుర్తి ఈస్ట్ బ్లాక్ సరిహద్దుల గుర్తింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. మండలంలోని కోమటిపల్లి క్రాస్ రోడ్ ప్రాంతంలో అటవీ భూముల హద్దులను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విజయలక్ష్మి, సెక్షన్ ఆఫీసర్ టి. రామారావు, బీట్ ఆఫీసర్ జె. భాస్కర్‌తో కలిసి పరిశీలించారు. అటవీ సరిహద్దుల వివరాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు.
భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు: ఎఫ్‌ఆర్‌ఓ
అటవీ శాఖకు సంబంధించిన భూములను ఎవరైనా ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విజయలక్ష్మి హెచ్చరించారు. అటవీ భూములు, వాటి హద్దులను స్పష్టంగా గుర్తించి పరిరక్షించడంలో భాగంగానే రిజర్వ్ ఫారెస్ట్ ఇనుగుర్తి ఈస్ట్ బ్లాక్ సరిహద్దులను పరిశీలిస్తున్నట్లు వివరించారు.
ప్రభుత్వం డిజిటల్ సర్వే నిర్వహిస్తున్న నేపథ్యంలో ముందస్తుగా రిజర్వ్ ఫారెస్ట్ భూముల బౌండరీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి గుర్తిస్తున్నట్లు తెలిపారు. అటవీ సంపద, ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.