భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి ప్రభుత్వ పాఠశాల పునర్నిర్మాణ పనులను వచ్చే ఏడాది మే చివరి నాటికి పూర్తి చేయాలని రాజ్యసభ సభ్యుడు, BRS పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర అధికారులను ఆదేశించారు. మంగళవారం తన సోదరుడు కిషన్‌తో కలిసి మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో కొనసాగుతున్న పాఠశాల భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.
తాను చదువుకున్న పాఠశాలను ఆధునిక హంగులతో పునర్నిర్మించాలనే సంకల్పంతో ఎంపీ రవిచంద్ర ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఇందులో భాగంగా తన వంతుగా ₹.1 కోటి విరాళం ప్రకటించడంతో పాటు, చమురు సంస్థల ద్వారా ₹.6 కోట్ల నిధులు మంజూరు చేయించడంలో కీలక పాత్ర పోషించారు. దీంతో పాఠశాల అభివృద్ధికి అవసరమైన నిర్మాణ పనులు చేపట్టారు.
నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పనులు పూర్తి చేయాలి
పాఠశాల పునర్నిర్మాణంలో భాగంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న భవన నిర్మాణ పనులను ఎంపీ రవిచంద్ర కలియతిరిగి పరిశీలించారు. నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లు, సిబ్బందికి సూచించారు. పనుల్లో జాప్యం లేకుండా వేగం పెంచి వచ్చే ఏడాది మే నెల చివరి నాటికి అన్ని నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిపై పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, సంబంధిత అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.