భారత్ సమాచార్, మెదక్ జిల్లా: భూముల సరిహద్దులను కచ్చితంగా గుర్తించి, రెవెన్యూ రికార్డుల్లో పారదర్శకత పెంచే లక్ష్యంతో నార్సింగి మండల పరిధిలోని జప్తి శివనూర్ గ్రామంలో అధికారులు భూముల రీసర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో భూములను పరిశీలించి వాటి హద్దులు, విస్తీర్ణం, ఇతర వివరాలను క్షుణ్ణంగా నమోదు చేశారు.
భూముల సరిహద్దుల గుర్తింపులో ఎలాంటి తప్పులకు తావులేకుండా, రెవెన్యూ రికార్డులను పక్కాగా నిర్వహించేందుకు ఈ రీసర్వే చేపట్టినట్లు అధికారులు తెలిపారు. క్షేత్రస్థాయిలో భూములకు సంబంధించిన వివరాలను పరిశీలించి నమోదు చేయడం వల్ల రికార్డుల్లో పొరపాట్లను గుర్తించడంతో పాటు భవిష్యత్తులో తలెత్తే భూ వివాదాలను నివారించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గ్రేస్ బాయి, సర్వేయర్ శ్రీకాంత్, GPO నాగరాజు, ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.