భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

4, నవంబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

తెలంగాణలో తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్..

తెలంగాణలో తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్..

భార‌త్ స‌మాచార్, విద్య‌ : తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యాశాఖ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై పిల్లల చదువుల పురోగతి, సమ్మేటివ్ అసెస్‌మెంట్‌-1 (SA-I) పరీక్షల ప్రోగ్రెస్ కార్డులను వాట్సాప్ ద్వారానే పొందవచ్చు. ఇందుకోసం పాఠశాలలకు వెళ్లి ఫలితాలు తెలుసుకోవాల్సిన అవసరం లేకుండా డిజిటల్ విధానంలో వివరాలు అందించనున్నారు. విద్యార్థులు ఏయే సబ్జెక్టుల్లో మంచి ప్రతిభ కనబరిచారు? ఎక్కడ మెరుగుపడాల్సి ఉంది? అనే విషయాలను తల్లిదండ్రులు సులభంగా తెలుసుకునేందుకు ఈ సదుపాయం ఉపయోగపడనుంది.

ఈ సదుపాయాన్ని తల్లిదండ్రులందరూ వినియోగించుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఈ. నవీన్ నికోలస్ సూచించారు. పిల్లల విద్యా ప్రగతిపై తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు దృష్టి పెట్టాలని, ఉపాధ్యాయులతో సమన్వయం చేసుకుంటూ చదువులో వెనుకబడిన విద్యార్థులకు అవసరమైన సహకారం అందించాలని కోరారు. గతంలో కూడా విద్యార్థుల వార్షిక ప్రగతి పత్రాలను డిజిటల్ విధానంలో అందించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే.

మరోవైపు రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు వివరాలను ఇంటిగ్రేటెడ్ స్కూల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ISMS) పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా 2026 జూన్ నుంచి సెప్టెంబర్ వరకు పెండింగ్‌లో ఉన్న హాజరు వివరాలను వెంటనే అప్‌డేట్ చేయాలని ఆదేశించింది. ఇకపై ప్రతి నెల హాజరు వివరాలను తరువాతి నెల 1వ తేదీలోపు నమోదు చేయాలని సూచించింది. ఈ నిబంధనలు అమలవుతున్నాయో లేదో జిల్లా విద్యాశాఖ అధికారులు పర్యవేక్షించాలని డైరెక్టర్ ఆదేశించారు.