భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సేవలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని స్థానిక సర్పంచ్ ఇట్టె లీల దేవేందర్ రెడ్డి, ICDS సూపర్వైజర్ జలగం సునీత సూచించారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం కాచికల్లు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో గురువారం VCPCC కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ ఇట్టె లీల దేవేందర్ రెడ్డి, ICDS సూపర్వైజర్ జలగం సునీత, పంచాయతీ కార్యదర్శి మల్లికార్జున్ తదితరులు హాజరయ్యారు.
ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
ఈ సందర్భంగా సర్పంచ్, సూపర్వైజర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ICDS ద్వారా అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, కిశోర బాలికలకు వివిధ సేవలు అందిస్తోందని తెలిపారు. ఈ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా బాలికల ఆరోగ్యం, సంక్షేమంపై కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు.
బాల్యవివాహాలు చట్టవిరుద్ధమని, ఎవరూ వాటిని ప్రోత్సహించవద్దని స్పష్టం చేశారు. చిన్న వయసులో వివాహాలు చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వివరించారు. కిశోర బాలికల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
బాలికలకు ఇబ్బందులు ఎదురైతే 1098కు కాల్ చేయాలి
బాలికలకు ఎక్కడైనా సమస్యలు లేదా ఇబ్బందులు ఎదురైతే వెంటనే 1098 చైల్డ్ హెల్ప్లైన్కు ఫోన్ చేసి సహాయం పొందాలని తెలిపారు. బాలికలకు వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలపై కూడా వివరించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా కార్యకర్తలు, బాలింతలు, తల్లులు, గర్భిణులు, గ్రామస్తులు పాల్గొన్నారు.