భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

5, నవంబర్ 2026, గురువారంభారత్ సమాచార్

రామాయణం క్లైమాక్స్‌లో అసలైన సర్‌ప్రైజ్..

రామాయణం క్లైమాక్స్‌లో అసలైన సర్‌ప్రైజ్..

భార‌త్ స‌మాచార్, సినిమా : భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రానికి నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. దర్శకుడు నితేశ్ తివారీ రూపొందించిన ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతాదేవిగా, యశ్ రావణుడిగా నటించారు. భారతీయ ఇతిహాసమైన రామాయణాన్ని అత్యాధునిక సాంకేతికత, భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో వెండితెరపై ఆవిష్కరించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మొదటి నుంచీ ఆసక్తి నెలకొంది. విడుదలైన తొలి రోజు నుంచే సినిమాకు సంబంధించిన స్పందనలు, ముఖ్యంగా కీలక సన్నివేశాలపై చర్చలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కథ విషయానికి వస్తే.. రావణుడు సీతాదేవిని అపహరించడం, ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన జటాయువు ప్రాణత్యాగం చేయడం వంటి భావోద్వేగ సన్నివేశాలతో మొదటి భాగం ముగుస్తుంది. సీతను తిరిగి తీసుకురావాలనే శ్రీరాముడి సంకల్పం తదుపరి భాగంలో జరగబోయే మహా సంగ్రామానికి పునాది వేస్తుంది. అయితే సినిమా ముగిసిందని థియేటర్ల నుంచి బయటకు వెళ్లిపోయే ప్రేక్షకులకు అసలైన సర్‌ప్రైజ్ మిస్ అవుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఎండ్ క్రెడిట్స్ సమయంలో వచ్చే పోస్ట్ క్రెడిట్ సీన్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

ఈ సన్నివేశంలో బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ హనుమంతుడిగా తొలిసారి పరిచయమవుతారు. అయితే ఆయన పూర్తి ముఖాన్ని చూపించకుండా మేకర్స్ ప్రత్యేకంగా ఈ సీన్‌ను రూపొందించారు. హనుమాన్ చాలీసా నేపథ్య సంగీతం వినిపిస్తుండగా, ఆకాశంలోకి ఎగురుతూ అపారమైన శక్తిని ప్రదర్శించే హనుమంతుడి రూపం ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచుతోంది. చివర్లో ‘జై శ్రీరామ్’ అంటూ వినిపించే గంభీరమైన స్వరం ఈ సన్నివేశానికి మరింత బలాన్ని చేకూర్చింది. ఈ విజువల్స్‌కు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

ఇక ఈ చిన్న పరిచయంతోనే రామాయణం రెండో భాగంపై అంచనాలు మరింత పెరిగాయి. తదుపరి భాగంలో శ్రీరాముడు, హనుమంతుడి పరిచయం, సీతాన్వేషణ, లంకలో జరిగే పరిణామాలు, రావణుడితో యుద్ధం వంటి కీలక ఘట్టాలు ప్రధానంగా ఉండనున్నాయి. అంతేకాదు, రావణుడి కుమారుడు మేఘనాథుడి పాత్రలో రాఘవ్ జుయాల్ పరిచయం కూడా ప్రేక్షకులకు మరో ఆసక్తికరమైన అంశం. రెండో భాగాన్ని 2028లో విడుదల చేసేందుకు చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మొత్తానికి సన్నీ డియోల్ హనుమంతుడి ఎంట్రీతో పార్ట్ 2 కోసం ప్రేక్షకుల్లో ఆసక్తి రెట్టింపైంది.