భారత్ సమాచార్, ఉద్యోగం : ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డీఎస్సీ-2026 (APTRT-2026) సమగ్ర నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 2,721 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ నవంబర్ 11 నుంచి ప్రారంభమై నవంబర్ 30 వరకు కొనసాగనుంది. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ పాఠశాలలతో పాటు వివిధ విద్యా సంస్థల్లోని ఖాళీలను ఈ నియామకాల ద్వారా భర్తీ చేయనున్నారు.
మొత్తం ఖాళీల్లో 2,111 పోస్టులు రెగ్యులర్ స్కూల్ అసిస్టెంట్ (SA), సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) కేటగిరీలకు సంబంధించినవి. ఇందులో 906 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 1,205 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి. ప్రత్యేక విద్యా విభాగంలో మరో 350 ఖాళీలు ప్రకటించారు. వీటిలో 150 స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 200 స్పెషల్ ఎడ్యుకేషన్ ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి.
ఇవే కాకుండా వివిధ సొసైటీలు, ఇతర విద్యా యాజమాన్యాల పరిధిలో మరో 260 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 30 ప్రిన్సిపాల్, 81 పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT), 113 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT), రెండు ఫిజికల్ డైరెక్టర్, 34 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు ఉన్నాయి. ఈ వివరాలను పరిశీలిస్తే మొత్తం 2,721 ఖాళీల్లో రెగ్యులర్, ప్రత్యేక విద్యతో పాటు సొసైటీల పోస్టులు కూడా ఉన్నట్లు స్పష్టమవుతోంది.
అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 11 నుంచి అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 20 నుంచి కంప్యూటర్ ఆధారిత విధానంలో (CBT) పరీక్షలు నిర్వహించనున్నట్లు సమాచారం. విద్యార్హతలు, వయోపరిమితి, దరఖాస్తు ఫీజు, పరీక్షల షెడ్యూల్, జిల్లాల వారీగా ఖాళీలు వంటి వివరాలను సమగ్ర నోటిఫికేషన్లో పరిశీలించాలి. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక వెబ్సైట్లోని నిబంధనలను పూర్తిగా చదవడం మంచిది.