భారత్ సమాచార్, జనగామ జిల్లా: తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి చెందిన లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ సభ్యులు లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, ఆర్థిక సహాయం అందజేశారు. ప్రభుత్వం కూడా వెంటనే ఆర్థిక సాయం ప్రకటించడంతో పాటు బాధిత కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు.
ఈ సందర్భంగా ఫోరం నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేకే కమిటీ ఇప్పటికీ కాలయాపన చేస్తోందని విమర్శించారు. ఉద్యమకారుల వివరాల నమోదు కోసం ప్రత్యేక వెబ్సైట్ను సైతం ప్రారంభించకపోవడంతో వారిలో తీవ్ర నిరాశ నెలకొందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన తొలి, మలి దశ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులు ఒక్కొక్కరుగా మరణిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమని అన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యమకారుల సమస్యలపై స్పందించి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మరో ఉద్యమానికి సిద్ధం కావాల్సి వస్తుందని హెచ్చరించారు. లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోకపోతే ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉందని ఫోరం నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగు అంజన్న, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు గుండు దయానంద్, కన్వీనర్ జగన్ యాదవ్, మహిళా ఉపాధ్యక్షురాలు శ్యామల, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నందగిరి రజనీకాంత్, సీనియర్ ఉద్యమ నాయకులు సంజీవరెడ్డి, నరసింహ తదితరులు పాల్గొన్నారు.