భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

6, నవంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

రైతులకు గుడ్ న్యూస్.. సబ్సిడీపై మొక్కజొన్న, జొన్న విత్తనాలు

అందుబాటులో మొక్కజొన్న విత్తనాలు 40% సబ్సిడీపై రామంపేట మండల రైతులకు అందుబాటులో ఉన్నవి

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి యాసంగి సాగుకు నీటి కొరత ఏర్పడే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో రైతులను ఆరుతడి పంటల సాగు వైపు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మొక్కజొన్న, జొన్న విత్తనాలను 40 శాతం సబ్సిడీపై అందుబాటులోకి తీసుకొచ్చింది. రామాయంపేట మండల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

వానాకాలంలో తక్కువ వర్షపాతం నమోదైన కారణంగా ప్రస్తుతం యాసంగి పంటలకు సరిపడా నీరు అందుబాటులో లేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో ఎక్కువ నీరు అవసరమయ్యే వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో పండించే ఆరుతడి పంటలను ఎంచుకోవడం ద్వారా రైతులు పంట నష్టాల నుంచి కొంతవరకు బయటపడే అవకాశం ఉంటుందని అధికారులు సూచిస్తున్నారు.

మొక్కజొన్న, జొన్నతో పాటు పొద్దుతిరుగుడు, నువ్వులు వంటి పంటలను సాగు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. ఈ పంటలకు తక్కువ నీరు అవసరమవడంతో పాటు మార్కెట్‌లో మంచి గిరాకీ ఉండటం వల్ల రైతులకు మెరుగైన దిగుబడులు, ఆర్థిక ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉందని వివరించారు. ప్రస్తుత నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపిక చేసుకోవాలని తెలిపారు.

ఇందులో భాగంగా రామాయంపేట మండల వ్యవసాయ కార్యాలయంలో లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన రైతు కళ్యాణ్‌కు వ్యవసాయ అధికారి ప్రవీణ్ కుమార్ చేతుల మీదుగా సబ్సిడీ విత్తనాలను పంపిణీ చేశారు. లక్ష్మాపూర్ గ్రామ సర్పంచ్ నవీన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఏఈఓ సందీప్, రైతులు పాల్గొన్నారు.